Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణలో మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఓపెన్ కోర్ట్‌లో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్, హరీష్ రావును సుమారు 40 నిమిషాల పాటు విచారించింది. ప్రారంభంలో ఆయనను “నిజాలే చెప్తానని” ప్రమాణం చేయించి ప్రశ్నల వర్షం మొదలుపెట్టింది.
కమిషన్ ప్రశ్నలు vs హరీష్ రావు సమాధానాలు
కమిషన్: ఇరిగేషన్ మంత్రిగా మీరు ఎన్ని రోజులు పనిచేశారు?
హరీష్ రావు: నేను సుమారు 2014 నుంచి 2018 వరకు ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాను.
కమిషన్: జీవో 115 కింద మంత్రుల సబ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు?
హరీష్ రావు: రైతులకు ఎక్కువ నీళ్లు అందించేందుకు అవసరమైన అధ్యయనం కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశాం.
కమిషన్: సబ్ కమిటీలో ఎవరెవరు ఉన్నారు?
హరీష్ రావు: తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ గార్లు మరియు నేనే ఉన్నాము.
కమిషన్: మేడిగడ్డ బ్యారేజీ స్థలాన్ని ఎందుకు మార్చారు?
హరీష్ రావు: మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో తుమ్మిడిహట్టి స్థలాన్ని వదిలివేసి మేడిగడ్డ వద్ద నిర్మాణానికి మారాం. ఇది సిడబ్ల్యూసి సూచనల మేరకే జరిగింది.
కమిషన్: మేడిగడ్డ నిర్మాణం ఎవరి నిర్ణయమో?
హరీష్ రావు: ఒక్కరి నిర్ణయం కాదు. మంత్రులు, అధికారులు పలు సమావేశాల తర్వాత నిర్ణయించారు.
కమిషన్: బ్యారేజీల లొకేషన్లు మారడంపై చర్యలు తీసుకున్నారా?
హరీష్ రావు: అది పూర్తిగా టెక్నికల్ అంశం. టెక్నికల్ రిపోర్టుల ఆధారంగానే మార్పులు జరిగాయి.
కమిషన్: హై పవర్ కమిటీకి లొకేషన్ మార్పు అధికారం ఉందా?
హరీష్ రావు: అప్పటి ప్రభుత్వం హై పవర్ కమిటీకి అన్ని అధికారాలు ఇచ్చింది.
కమిషన్: కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు?
హరీష్ రావు: ప్రాజెక్టు కోసం లోన్లు తీసుకోవడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.
కమిషన్: తీసుకున్న లోన్లను ఎలా చెల్లించాలనుకున్నారు?
హరీష్ రావు: నీళ్లు అమ్మి రెవెన్యూ పొందేలా చేసి రీపేమెంట్ చేయాలనుకున్నాం. కానీ కోవిడ్ వల్ల ఆలస్యం అయింది.
కమిషన్: బ్యారేజీలలో నీళ్లు నిల్వ చేశారు?
హరీష్ రావు: రిజర్వాయర్లలో 141 టీఎంసీల నీళ్లు నిల్వ చేశాం. బ్యారేజీలలోని ఫుల్ లెవెల్ ట్యాంక్ వరకు నిల్వ అంశాలు టెక్నికల్‌గా అధికారుల పరిధిలో ఉంటాయి.
కమిషన్: నీళ్లు నింపమని ఎవరైనా ఆదేశించారా?
హరీష్ రావు: బ్యారేజీలలో నీళ్లు నింపాలన్న ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వంగా జారీ కాలేదు.