Harish Rao : తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల నిర్వహణపై స్పష్టతనిచ్చేందుకు నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని, సభ నిర్వహణ తీరుపై పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సభను ఎక్కువ రోజులు నిర్వహించాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు.
బీఏసీ సమావేశం అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, అందుకే అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు. కేవలం వారం రోజుల్లో ప్రజా సమస్యలన్నింటిపై చర్చించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కేవలం మూడు లేదా నాలుగు రోజులతో సభను ముగించే ప్రయత్నం చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల డిమాండ్లపై ప్రభుత్వం స్పందిస్తూ.. ప్రస్తుతం ఒక వారం పాటు సమావేశాలను నిర్వహించేందుకు అంగీకరించింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులను బట్టి సమావేశాలను మరిన్ని రోజులు పొడిగించే అంశంపై మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు హరీష్ రావు వెల్లడించారు. దీనివల్ల సభ ఎన్ని రోజులు జరుగుతుందనే దానిపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
నదీ జలాల అంశంపై సభలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. ప్రభుత్వం ఈ అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (PPT) ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తాము కూడా పీపీటీ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని బీఏసీ సమావేశంలో కోరింది. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిని, ప్రాజెక్టుల వివరాలను ప్రజలకు వివరించేందుకు తమకు కూడా సమాన అవకాశం ఇవ్వాలని హరీష్ రావు కోరారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే బీఏసీలో జరిగిన ఈ చర్చలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. వారం రోజుల సమావేశాల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రతిపక్షం ప్రభుత్వంపై ఎలాంటి అస్త్రాలను ప్రయోగిస్తుందనేది వేచి చూడాలి.
AP News: మందు బాబులకు శుభవార్త.. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు!
