సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను కూడా ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తోందని ఆరోపించారు. కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని, ముఖ్యంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కరువు మండలాలను ఉద్దేశపూర్వకంగానే ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లాపై చిన్నచూపు.. వర్షపాతం తక్కువైనా కరువు లేదుట
మెదక్ జిల్లాలో కేవలం ఒక్క మండలాన్ని మాత్రమే కరువు మండలంగా ప్రకటించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని హరీశ్ రావు అన్నారు. ఉదాహరణకు నర్సాపూర్ నియోజకవర్గంలో 27 శాతం, కౌడిపల్లిలో 13 శాతం, చిలిపిచెడ్ మండలంలో 39 శాతం తక్కువ వర్షపాతం నమోదైనా వాటిని కరువు మండలాలుగా గుర్తించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కరువు మండలాల గుర్తింపు విషయంలో కపట ప్రేమ చూపుతోందని, అసలు కరువు అంచనా కోసం సరైన కమిటీయే వేయలేదని విమర్శించారు. కొడంగల్ అభివృద్ధికి మాత్రం కోట్లాది రూపాయలతో సీఎం శంకుస్థాపనలు చేసుకుంటున్నారని, మెదక్ జిల్లా అంటేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిన్నచూపు అని మండిపడ్డారు.
రుణమాఫీ మోసం.. విద్యుత్ కోతలపై నిలదీత
రైతుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి సున్నా మార్కులు వేయొచ్చని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ దేవుళ్లపై ఒట్లు వేసి ఘరానా మోసం చేశారని విమర్శించారు. నర్సాపూర్ నియోజకవర్గంలోనే సుమారు 16 వేల మందికి ఇప్పటివరకు రుణమాఫీ కాలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో 24 గంటల నిరంతర విద్యుత్ వస్తే.. నేడు కాంగ్రెస్ పాలనలో కనీసం 12 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని, రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి ఈ విద్యుత్ కోతలే ప్రధాన కారణమని ఆరోపించారు.
ప్రజల గొంతు తడపడం కంటే బీరు ఫ్యాక్టరీలపైనే ప్రేమ
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సింగూరు ప్రాజెక్టులో తాగునీటి సమస్య తీవ్రమైందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజలకు తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని, కానీ బీరు కంపెనీలకు మాత్రం దర్జాగా నీళ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015లో ఇలాంటి కరువు పరిస్థితి వచ్చినప్పుడు సింగూరు నీళ్లను ఉమ్మడి మెదక్ జిల్లా తాగునీటి అవసరాలకే వాడుకున్నామని గుర్తుచేశారు. కానీ నేడు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు నీళ్లు వెళ్తున్నా ఇక్కడి కాంగ్రెస్ నేతలకు సోయి లేదా అని ప్రశ్నించారు. ప్రజల గొంతు తడపడం కంటే బీరు ఫ్యాక్టరీలపైనే ప్రభుత్వానికి ఎక్కువ ప్రేమ ఉందని విమర్శించారు. సంగారెడ్డిలోని మూడు బీరు కంపెనీలకు ట్యాంకర్ల ద్వారా నిరంతరం నీళ్లు తరలిస్తున్నారని, మంజీరా నదిలో ఈ కంపెనీలు అక్రమంగా బోర్లు వేస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారని హరీశ్ రావు నిలదీశారు.

