Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్

  • రేవంత్‌పై హరీష్ విమర్శలు
  • ఐటీ పార్క్ భూములపై ఆరోపణలు
  • మెదక్‌లో క్లీన్ స్వీప్ ధీమా
  • '117' వ్యాఖ్యపై సెటైరికల్ కౌంటర్
Harish Rao

Harish Rao

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిర్మించిన ఆస్పత్రిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రారంభించలేకపోయిందని మండిపడ్డారు. పటాన్‌చెరులో ఐటీ పార్కు ఏర్పాటు కోసం గతంలో భూమిని కేటాయిస్తే, సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ భూమిని అమ్మేశారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో కనురెప్ప కొట్టేంత సేపు కూడా కరెంట్ పోలేదని గుర్తుచేసిన ఆయన, రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే గుడిని, గుడిలో లింగాన్ని మింగేసేలా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న 10కి 10 సీట్లను బీఆర్‌ఎస్ పార్టీయే క్లీన్ స్వీప్ చేస్తుందని, ఒకవేళ భవిష్యత్తులో అక్కడ సీట్లు పెరిగినా అవన్నీ తమ ఖాతాలోనే పడతాయని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 117 సీట్లు గెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చెబుతున్న ‘117’ నంబర్‌ను విశ్లేషిస్తూ.. “వన్ ప్లస్ వన్ ప్లస్ సెవెన్ (1+1+7) అంటే కాంగ్రెస్‌కు 9 సీట్ల కంటే ఎక్కువ వచ్చే ప్రసక్తే లేదు” అంటూ హరీష్ రావు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.