బోడుప్పల్ పరిధిలోని పలు కాలనీల ప్రజల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, రేవంత్ రెడ్డి సర్కార్‌ను ’30 శాతం కమిషన్ ప్రభుత్వం’ అని ప్రజలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని ఆరోపించారు. నిషేధిత జాబితా పేరుతో ప్రజల ఆస్తులను కబ్జా చేసే హక్కు రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారని ఆయన నిలదీశారు.
దశాబ్దాల నివాసాలపై 22A నిబంధన.. కాలనీ వాసుల్లో ఆందోళన
బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన వందలాది మంది బాధితులు హరీష్ రావును కలిసి తమ ఆవేదనను పంచుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, సర్వే నంబర్ 215, 215 పార్ట్‌లలో గత 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా సుమారు 1,500 కుటుంబాలు ప్రశాంతంగా జీవిస్తున్నాయని తెలిపారు. అయితే, ఈ ఇళ్లను రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22A నిషేధిత జాబితాలో చేర్చడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అత్యవసర కష్టాల్లో ఇళ్లను అమ్ముకుందామని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలియడంతో ప్రజలు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కమీషన్ల కోసమే కృత్రిమ వివాదాలు.. బీఆర్ఎస్ పోరాట హెచ్చరిక
చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులను అడ్డుపెట్టుకుని ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30 శాతం కమీషన్లు దండుకునేందుకే ప్రభుత్వం ఇలాంటి కృత్రిమ వివాదాలు సృష్టిస్తోందని హరీష్ రావు విమర్శించారు. దశాబ్దాలుగా నివాసముంటున్న ప్రజలకు 22A భయం చూపిస్తూ, బినామీలతో సెటిల్మెంట్లు చేసుకునే దందాకు తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు. బోడుప్పల్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాధితులెవరూ అధైర్యపడవద్దని, ఈ వసూళ్ల సర్కార్ మెడలు వంచైనా బాధితుల ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మాటలు పక్కనబెట్టి, తక్షణమే ఆయా కాలనీలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని, లేకపోతే బాధితుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

