Guvvala Balaraju : బీఆర్‌ఎస్ – కాంగ్రెస్ మధ్య ఉన్న రాజకీయ సంబంధాలపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు గువ్వల బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ వ్యవహరించిన విధంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గొంతు నొక్కే విధానాన్ని అవలంబిస్తోందని ఆయన విమర్శించారు.
“కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కలసి నడుస్తున్నాయి. ‘నువ్వు కాకుంటే నేను, నేను కాకుంటే నువ్వు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి” అని బాలరాజు వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం చదవలేదని, దేశ ఖ్యాతిని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని, ఆయన ఎప్పటికీ ప్రధాని కాలేరని అన్నారు. తెలంగాణ, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడుల్లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందో—EVMలతోనా, బ్యాలెట్ పేపర్‌తోనా అనే ప్రశ్నలు లేవనెత్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రామచందర్ రావును అడ్డుకోవడం హిందూ సమాజాన్ని సంఘటితం కాకుండా చేయడానికేనని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాజకీయ యావలో నిమగ్నం కావొద్దని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని, 2034 వరకు సీఎంగా ఉండాలనుకుంటే అభ్యంతరం లేదని, కానీ మహిళలను అవమానించే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్‌కు ప్రజలు ఓటుతో బోంద పెడతారని అన్నారు.
“మీ అరాచకాలకు చెక్ పెడతాం, బీజేపీ జెండా ఎగురవేస్తాం” అని స్పష్టం చేశారు. రాజాసింగ్ తనను ఉద్దేశించి మాట్లాడలేదని, గత రెండు సార్లు తాను కూడా ఎమ్మెల్యే అయిన విషయాన్ని ఆయనకు తెలుసని అన్నారు. “నేను పదవుల కోసం బీజేపీలోకి రాలేదు” అని బాలరాజు స్పష్టం చేశారు. ఫార్మ్‌హౌస్ కేసులో లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
