Gujjula Premender Reddy Reacts On Rit Peitition In High Court: మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సాగిన బేరసారాల వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. బీజేపీపై అభాండాలు మోపుతూ.. బట్ట కాల్చి మీదేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే తాము నిష్పక్షపాత దర్యాప్తును కోరుతూ.. రాష్ట్ర హైక్టోర్టులో గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ‘రిట్’ అప్పీల్ దాఖలు చేసిందని చెప్పారు. ఈ వ్యవహారాన్ని నడిపింది టీఆర్ఎస్ పార్టీనేనని, అమ్ముడుపోయేందుకు సిద్ధమైంది టీఆర్ఎస్ వాళ్లేనని ఆరోపించారు. తమను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది, ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్ వాళ్లేనని అన్నారు. ఇందులో బీజేపీ ప్రమేయం ఎక్కడా కనిపించడం లేదని, ఇదంతా టీఆర్ఎస్ ఆడిన డ్రామా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యవహారంలో బీజేపీ ప్రమేయం లేకపోయినప్పటికీ.. బీజేపీపై బురద జల్లే కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోందని ప్రేమేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు చూస్తుంటే.. పక్కా ప్లాన్ ప్రకారమే బీజేపీని అప్రతిష్టపాలు చేయడానికి నడిపిన కుట్ర అని స్పష్టమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు పక్షపాతపూరితంగా ఉండే అవకాశం ఉందని, అందుకే నిష్పక్షపాత దర్యాప్తు కోసం రాష్ట్ర హైకోర్టు తలుపులు తట్టామని పేర్కొన్నారు. కానీ హైకోర్టు ఆదేశాలు రాకముందే.. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి, బీజేపీపై నిందలు మోపారన్నారు. ఆయన ఆధ్వర్యంలో పని చేసే రాష్ట్ర పోలీసులతో ఏర్పాటు చేసిన సిట్‌పై తమకు నమ్మకం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అందంగా వండి వార్చిన ఈ వ్యవహారంలో.. తమ నిర్దోశిత్వాన్ని నిరూపించుకునేందుకే సీబీఐ లేదా హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు.