Local Governance : గ్రామ పంచాయతీలకు బంపర్ పవర్.. సొంత ఆదాయంపై పూర్తి హక్కు.!

  • క్యాబినెట్‌లో కీలక నిర్ణయం
  • జీపీల ఖాతాల్లోకే నిధులు
  • ట్రెజరీ అవసరం ఇక లేదు
  • గ్రామాభివృద్ధికి ఊతం
Gp

Gp

Local Governance : తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తిని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. గ్రామ పంచాయతీల సొంత ఆదాయంపై వారికి పూర్తి స్వేచ్ఛ కల్పించేలా, రేపు జరగబోయే మంత్రివర్గ (క్యాబినెట్) సమావేశంలో ‘తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018’ సవరణకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఈ సవరణలో భాగంగా, పంచాయతీ రాజ్ చట్టంలోని 70(3) సెక్షన్‌ను సవరించి, గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో కాకుండా.. ఇకపై నేరుగా ఆయా జీపీల (GP) బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నారు. క్యాబినెట్ ఆమోదం పొందిన వెంటనే ఈ నిబంధనను అమలులోకి తెచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను కూడా జారీ చేసే అవకాశం ఉంది.

 

ఈ చట్ట సవరణతో గ్రామాల్లో స్థానికంగా సమకూరే పన్నులు, ఇతర సొంత వనరుల ఆదాయం నేరుగా పంచాయతీల గుప్పిట్లోకి రానుంది. దీనివల్ల నిధుల కోసం ప్రభుత్వ ట్రెజరీపై ఆధారపడాల్సిన అవసరం తప్పడమే కాకుండా.. గ్రామంలో వసూలైన డబ్బును వెంటనే స్థానిక అభివృద్ధి పనుల కోసం వేగంగా ఖర్చు చేసుకునే వీలు కలుగుతుంది. ఫలితంగా గ్రామాల్లో అత్యంత కీలకమైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటుతో పాటు ఇతర అత్యవసర మౌలిక వసతుల పనులు ఎక్కడికక్కడ ఎలాంటి జాప్యం లేకుండా మరింత వేగంగా సాగేందుకు మార్గం సుగమం కానుంది.