తెలంగాణ రాజకీయాలు మళ్ళీ హస్తినకు చేరాయా? మళ్ళీ ఢిల్లీకి వచ్చిన తెలంగాణ గవర్నర్ తమిళి సై తాజా పరిస్థితులను కేంద్రానికి వివరించినట్టు తెలుస్తోంది. పది రోజుల కిందటే రెండ్రోజుల పాటూ ఢిల్లీకి వెళ్లి వచ్చారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ప్రధాని నరేంద్ర మోఢీ, కేంద్ర అమిత్ షాలతో గత పర్యటనలో భేటీ అయి పలు విషయాలు వారికి వివరించి వచ్చారు.
రాష్ట్రంలోని పలు అంశాలపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు తమిళి సై సౌందరరాజన్. మరోసారి తమిళసై ఢిల్లీ పర్యటనలో వుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ కేంద్ర సహాయమంత్రి జితేందర్ సింగ్ కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు తమిళిసై. రేపు మరోసారి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం వుందని ఢిల్లీ సమాచారం. ఇప్పటికే రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య పెరుగుతున్న దూరం నేపథ్యంలో కేంద్రంతో ఆమె ఏయే విషయాలు చర్చిస్తారనేది అంతుచిక్కడం లేదు. గవర్నర్ ఢిల్లీ పర్యటన తర్వాత బహిరంగంగానే ఆమెపై విమర్శలు చేశారు పలువురు తెలంగాణ మంత్రులు.
గవర్నర్ తమిళి సై ఇటీవల భద్రాద్రి టూర్ లోనూ ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఢిల్లీకి వెళ్ళి వచ్చాక కూడా అధికారులు ఆమె పర్యటనను పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. అయితే భద్రాద్రి పర్యటనలోనూ అదే తంతు మళ్ళీ కనిపించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హన్మకొండ జిల్లా పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు ప్రజా ప్రతినిధులెవ్వరూ రాలేదు. ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికేందుకు గ్రేటర్ వరంగల్ మేయర్ హాజరుకాలేదు. జాతీయ సాంస్కృతిక మహోత్సవం ప్రారంభోత్సవానికి గవర్నర్ హాజరయ్యారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది.
Read Also: Governor Tamilisai: వివాదం ఏమీ లేదని నవ్వేసిన తమిళిసై
అటు పుదుచ్చేరిలోనూ సేమ్ సీన్ రిపీటయింది. అయితే అక్కడ విపక్షం రూపంలో జరిగింది. పుదుచ్చేరిలో ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ పార్టీల నుండి అలాంటి చేదు అనుభవమే ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళిసైకి ఎదురయ్యింది. తెలంగాణలో ముందస్తు ఉగాది వేడుక నిర్వహించినట్లే పుదుచ్చేరిలోనూ తమిళ సంవత్సరాది ‘చిత్తిరై నిలవు’ సందర్భంగా ప్రత్యేక విందు ఏర్పాటుచేసారు. ఈ విందుకు పుద్దుచ్చేరి సీఎం రంగస్వామి, మంత్రులు, అధికార, ప్రతిపక్షాలకు చెందిన కీలక నాయకులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానించారు. తమిళిసై ఏర్పాటుచేసిన విందుకు ప్రతిపక్ష డీఎంకె, కాంగ్రెస్ పార్టీలు గైర్హాజరయ్యాయి. ఇంచార్జి లెప్టినెంట్ గవర్నర్ గా రాజ్యాంగబద్దమైన హోదాలో వున్న తమిళిసై తన పరిధి దాటి వ్యవహరిస్తూ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ ప్రతిపక్షాలు ఈ విందుకు హాజరుకాలేదు. తెలంగాణలో అధికార పక్షం, అటు పుదుచ్చేరిలో విపక్షం ఆమె పట్ల వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఢిల్లీ పర్యటనలో అన్ని అంశాలూ తమిళిసై ప్రధాపి, హోంమంత్రి దృష్టికి తెస్తారా? లేదా? అనేది తేలాల్చి వుంది.
