ఎంతో కాలంగా.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హైదరాబాద్ జర్నలిస్టులకు గుడ్‌న్యూస్ అందించింది. పదవి విరమణకు ఒక రోజు ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తీపి కబురు చెప్పారు.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి పచ్చజెండా ఊపారు.. అయితే, సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు హైదరాబాద్ జర్నలిస్టులు… జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు ఇళ్లస్థలాల కేసులో విచారణ జరుగుతుండగా.. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడిపెట్టకూడదన్నారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ.. జర్నలిస్టులకు 12 ఏళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని.. ఐఏఎస్, ఐపీఎస్‌ల గురించి నేను మాట్లాడ్డం లేదు.. ఓ చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బందిపడాలి? అని ప్రశ్నించారు.. రూ. 8,000 నుంచి రూ. 50 వేల జీతం తీసుకునే సుమారు 8వేల మంది జర్నలిస్టులు అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఇక, హైదరాబాద్‌లో జర్నలిస్టులకు భూమి కేటాయించారు. కానీ, అభివృద్ధి చేయలేదన్నారు సీజేఐ. వారంతా కలిసి స్థలం కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్లు చేశారని ఈ సందర్భంగా గుర్తుచేసిన ఆయన.. జర్నలిస్టుల స్థలాన్ని వారు స్వాధీనం చేసుకునేందుకు తాము అనుమతిస్తున్నామన్నారు.. జర్నలిస్టులు వారి స్థలంలో నిర్మాణాలు జరుపుకోవచ్చని స్పష్టం చేశారు. మరోవైపు, జర్నలిస్టుల ఇళ్ల సమస్యను పరిష్కరించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఈ తీర్పు తోడ్పడుతుందని పేర్కొన్న ఆయన.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును క్లీయర్ చేసినందుకు సీజేఐకి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.