Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!

  • పంద్రాగస్టు వేడుకల వేళ గోల్కొండలో ట్రాఫిక్ ఆంక్షలు
  • ఉదయం 6 నుంచి 12 వరకు రూట్లలో మార్పులు
  • పాస్‌లను బట్టి ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు
  • సాధారణ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు
Golconda Routes

Golconda Routes

Golconda Traffic : భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం గోల్కొండ కోటలోని రాణీ మహల్ లాన్స్‌లో ఘనంగా జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో గోల్కొండ పరిసరాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలను తెలుసుకుని ప్రయాణించాలని సూచించారు.

రామదేవ్‌గూడ నుంచి గోల్కొండకు సాధారణ వాహనాలకు నో ఎంట్రీ

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామదేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట వైపు వెళ్లే రహదారిని సాధారణ వాహనాల రాకపోకలకు మూసివేయనున్నారు. అయితే కార్యక్రమానికి హాజరయ్యే ఆహ్వానితులు తమ కార్ పాస్‌ల ఆధారంగా నిర్దేశించిన మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.

A, B పాస్ ఉన్నవారు ఇలా వెళ్లాలి

A (గోల్డ్), A (క్రీమ్), B (బ్లూ) పాస్ ఉన్న వాహనాలు సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం వైపు నుంచి రేతిబౌలి, నానల్ నగర్, బాలికా భవన్, లంగర్ హౌస్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జి మీదుగా రామదేవ్‌గూడ జంక్షన్ చేరుకోవాలి. అక్కడి నుంచి కుడివైపు తిరిగి మక్కై దర్వాజా ద్వారా గోల్కొండ కోటకు వెళ్లాలి.

A (గోల్డ్) పాస్: ఫతే దర్వాజా రోడ్డులో పార్కింగ్.

  • A (క్రీమ్), B (బ్లూ): గోల్కొండ బస్ స్టాప్ వద్ద పార్కింగ్.
  • C (గ్రీన్) పాస్ వాహనాలకు పార్కింగ్ ఎక్కడంటే?

సెవెన్ టాంబ్స్, బంజారా దర్వాజా వైపు నుంచి వచ్చే C పాస్ వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎడమవైపు తిరిగి ఒవైసీ గ్రౌండ్‌కు చేరుకోవాలి. లంగర్ హౌస్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వారు ఫతే దర్వాజా, బడా బజార్ వద్ద కుడివైపు తిరిగి GHMC ఐలాండ్ మీదుగా ఒవైసీ లేదా GHMC ప్లే గ్రౌండ్‌లో వాహనాలను పార్క్ చేయాలి.

D (రెడ్) పాస్.. గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో పార్కింగ్

D (రెడ్) పాస్ ఉన్న వాహనాలు షేక్‌పేట్ నాలా, టోలీచౌకి, సెవెన్ టాంబ్స్, బంజారా దర్వాజా మీదుగా గోల్కొండ ఏరియా ఆసుపత్రికి చేరుకోవాలి. అక్కడి ఆసుపత్రి ప్రాంగణంలోనే వాహనాలను పార్క్ చేయాలి.

సాధారణ ప్రజలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు

E (బ్లాక్) పాస్ కింద వచ్చే సాధారణ ప్రజలు లంగర్ హౌస్ ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని ఫతే దర్వాజా వైపు ఉన్న తవక్కల్ డైవర్షన్ పాయింట్ సమీపంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వాహనాలు పార్క్ చేయాలి.

షేక్‌పేట్, టోలీచౌకి వైపు నుంచి వచ్చే వారు సెవెన్ టాంబ్స్, డెక్కన్ పార్క్ లేదా గోల్కొండ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద పార్కింగ్ చేసుకోవచ్చు.

వేడుకల తర్వాత తిరుగు ప్రయాణం ఇలా..

  • A గోల్డ్, A క్రీమ్, B బ్లూ: మక్కై దర్వాజా–రామదేవ్‌గూడ–లంగర్ హౌస్ మీదుగా వెళ్లాలి.
  • C గ్రీన్: బడా బజార్, ఫతే దర్వాజా లేదా బంజారా దర్వాజా, సెవెన్ టాంబ్స్ వైపు వెళ్లాలి.
  • D రెడ్: బంజారా దర్వాజా, సెవెన్ టాంబ్స్ మీదుగా వెళ్లాలి.
  • E బ్లాక్: తమకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల నుంచే తిరిగి వెళ్లాలి.
  • ఉదయం 10.30 నుంచి సాధారణ వాహనాలకు మళ్లింపులు

వేడుకలు ముగిసే సమయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణ వాహనాల రాకపోకలకు అదనపు మళ్లింపులు ఉంటాయి. సెవెన్ టాంబ్స్ నుంచి గోల్కొండ వైపు వచ్చే వాహనాలను గోల్ఫ్ క్లబ్, జమాలీ దర్వాజా వద్ద మళ్లిస్తారు. లంగర్ హౌస్ నుంచి వచ్చే వాహనాలను బడా బజార్ జంక్షన్ వద్ద GHMC ఐలాండ్ వైపు మళ్లించనున్నారు.

కార్ పాస్‌లు కనిపించేలా ఉంచాలి

ఆహ్వానితులు తమ వాహనాల విండ్‌షీల్డ్ ఎడమవైపు కార్ పాస్‌ను స్పష్టంగా కనిపించేలా అంటించుకోవాలని పోలీసులు సూచించారు. గోల్కొండ కోటకు వెళ్లే ప్రధాన రహదారులపై ఎక్కడా వాహనాలను పార్క్ చేయవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాలను పాటిస్తూ సహకరించాలని వాహనదారులను కోరారు.

ట్రాఫిక్ అప్‌డేట్స్: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో తాజా సమాచారం తెలుసుకోవచ్చు. అత్యవసర ప్రయాణ సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్: 9010203626ను సంప్రదించవచ్చు.