గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం ఇప్పటికే సమావేశం అయ్యింది.. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బీపీపాండే నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించారు.. పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు అధీనంలోకి తీసుకోవడంపై సమాలోచనలు చేవారు.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది.. మొదటి దశలో అయిదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం గుర్తించింది. మిగిలిన చోట్ల రెండు రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలుండటం వల్ల ప్రస్తుతానికి వీలు కాదని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా సిబ్బంది, కార్యాలయాలు, యంత్రాలు, పరికరాలు ఇలా అన్ని అంశాలపై సమగ్ర ముసాయిదా తయారు చేసింది. ఇక, నిన్న జరిగిన సమావేశంలోని అంశాలపై ఇవాళ గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో చర్చించనున్నారు.. అయితే, ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు దీనికి ఏమేరకు సమ్మతి తెలుపుతాయన్నది ఆసక్తిగా మారగా.. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలులోకి తేవాలన్న ప్రయత్నాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.. దీంతో.. ఈరోజు ఉదయం 11 గంటలకు భేటీకానున్న గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంపై ఆసక్తి నెలకొంది.. గెజిట్ అమలు పై ప్రధాన చర్చ సాగనుండగా.. ఈనెల 14 నుంచి గెజిట్ ని అమలు చేస్తామంటున్న కేంద్రం ప్రభుత్వ నిర్ణయానికి అన్ని అడ్డంకులు తొలగిపోతాయేమో చూడాలి.