Fire Accident : మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని అన్నోజిగూడ సమీపంలో శుక్రవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓమ్నీ వ్యాన్‌లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మంటలు వ్యాపించిన సమయంలో వాహనంలో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో కిందకు దిగి పరుగులు తీయడంతో పెను ప్రాణనష్టం తప్పింది. పెట్రోల్ బంకులోకి మంటల వాహనం ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తోంది. ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు అంటుకోవడంతో డ్రైవర్ వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. అయితే, కంగారులో హ్యాండ్ బ్రేక్ వేయకుండానే డ్రైవర్ కిందకు దిగిపోవడంతో, మండుతున్న ఆ ఓమ్నీ వ్యాన్ అదుపు తప్పి నేరుగా రహదారి పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది.
నిప్పురవ్వలతో ఉన్న వాహనం పెట్రోల్ బంకు లాంటి అత్యంత ప్రమాదకర ప్రాంతంలోకి వెళ్లడంతో అక్కడ ఉన్న వాహనదారులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురై అటు ఇటు పరుగులు తీశారు. సిబ్బంది సమయస్ఫూర్తి – సాహసం ఒకవేళ మంటలు పెట్రోల్ ట్యాంకర్లకు గనుక వ్యాపించి ఉంటే ఊహించని స్థాయిలో విస్ఫోటనం సంభవించి ఉండేది. కానీ, పెట్రోల్ బంకు సిబ్బంది అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ప్రాణాలకు తెగించి వెంటనే అగ్నిమాపక పరికరాలను (Fire Extinguishers) సిద్ధం చేసి, వ్యాన్‌పై రసాయనాలను చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు.
సుమారు పది నిమిషాల పోరాటం తర్వాత మంటలు పూర్తిగా ఆరిపోయాయి. బంకు సిబ్బంది,స్థానిక వాహనదారులు సకాలంలో స్పందించడం వల్లే పెను విపత్తు తప్పిందని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో ఓమ్నీ వ్యాన్ పూర్తిగా దగ్ధమైనప్పటికీ, ప్రయాణికులు, డ్రైవర్ అందరూ క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో అన్నోజిగూడ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.
Madras High Court: 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఆస్ట్రేలియా చట్టాన్ని పరిశీలించండి..
