Site icon NTV Telugu

Hyderabad:‘పుష్ప’ తరహాలో స్మగ్లింగ్.. అరటిపండ్ల చాటున ఎర్ర చందనం

Yerrachadanam

Yerrachadanam

వ్యాపారంలో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆలోచిస్తున్న ఇద్దరికి తెలుగులో వచ్చిన పుష్ప సినిమా కొత్త ఆలోచనకు ఉత్తేజపరిచింది. దీంతో శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనంను స్మగ్లింగ్‌ చేసి డబ్బు సంపాదించాలని రాయలసీమకు చెందిన అరటిపండ్ల వ్యాపారులిద్దరూ స్కెచ్ వేశారు. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, అరటిపండ్ల చాటున హైదరాబాద్‌కు తరలించి అడ్డంగా ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులకు పట్టుబడ్డారు.

వీరివద్ద నుంచి రూ. 60.18 లక్షల విలువైన 1500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ కథనం ప్రకారం.. ఏపీ కడప జిల్లాకు చెందిన షేక్‌ మహ్మద్‌ రఫీ అరిటి పండ్ల వ్యాపారి. ఏపీ, యూపీ, రాజస్థాన్‌, ఢిల్లీ, తెలంగాణ తదితర రాష్ర్టాలకు అరటిపండ్లు సరఫరా చేస్తుంటాడు. కర్నూల్‌ జిల్లాకు చెందిన ముల్లా బషీర్‌ అహ్మద్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నేరెడ్‌మెట్‌ ప్రాంతంలో నివాసముంటూ అరటిపండ్ల వ్యాపారం చేస్తున్నాడు.

ఒకటే వ్యాపారం కావడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తాము చేస్తున్న వ్యాపారంలో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఎర్ర చందనం వ్యాపారం చేయాలని ప్లాన్‌ చేశారు. ఈ క్రమంలోనే వీరికి కడప జిల్లా బ్రహ్మంగారి మఠానికి చెందిన మూర్తి పరిచయమయ్యాడు. అతడి వద్ద నుంచి లక్ష రూపాయలకు 1500 కిలోల బరువున్న 31 ఎర్ర చందనం దుంగలు కొనుగోలు చేశారు.

వాటిని అరటి పండ్లు సరఫరా చేసే లారీల్లో హైదరాబాద్‌కు తరలించి, మౌలాలిలో దాచిపెట్టారు. విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి బృందం మల్కాజిగిరి పోలీసుల సహకారంతో ఎర్ర చందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మూడు సెల్‌ఫోన్లు, రూ. 1600 నగదు రికవరీ చేశారు. ఎర్రచందనం విలువ సుమారు రూ. 68,16,600 ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మూర్తి కోసం గాలిస్తున్నారు.

Nadendla Manohar: నోటికొచ్చిన హామీలతో మోసం చేశారు

Exit mobile version