హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. పార్టీ సీనియర్ నేత, మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పక్కన కూర్చొనే విషయంలో కాంగ్రెస్ నాయకులు ఫిరోజ్‌ఖాన్, కార్వాన్ ఇన్ చార్జ్ ఉస్మాన్ ఆల్ హాజ్రీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మొదట ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ గొడవ కాస్తా శృతిమించి ఒకరి చొక్కాలు ఒకరు పట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఉస్మాన్.. ఫిరోజ్‌ఖాన్‌ను గట్టిగా తోసేయడంతో ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. గాంధీభవన్ లో సీనియర్ నేతల సమక్షంలోనే ఈ రసాభాస జరగడంతో అక్కడ ఉన్న పార్టీ శ్రేణులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి.
ఈ గొడవ మరింత పెద్దది కాకుండా ఉండేందుకు అక్కడే ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆవేశంలో ఉన్న నేతలు వీహెచ్‌ను కూడా పక్కకు తోసేసేందుకు ప్రయత్నించడంతో వాతావరణం మరింత వేడెక్కింది. వెంటనే అప్రమత్తమైన మిగతా కాంగ్రెస్ నాయకులు, భద్రతా సిబ్బంది మధ్యలో దూరి ఇరువర్గాలను విడదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
