Speaker Gaddam Prasad: స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్.. బీఆర్‌ఎస్ తీరుపై అసంతృప్తి

  • హరీశ్ రావుపై స్పీకర్ అసహనం
  • బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై చర్యల హెచ్చరిక
  • పోలీసులపై దాడులపై సీరియస్
  • కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేశా
Harish Rao

Harish Rao

తెలంగాణ శాసనసభలో చోటుచేసుకుంటున్న పరిణామాలు , ప్రతిపక్ష పార్టీల వైఖరిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ సభా నిర్వహణ, క్రమశిక్షణ , సభ్యుల ప్రవర్తనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

మైక్ ఇస్తే క్షమాపణ చెబుతారనుకున్నా

నిన్న శాసనసభలో జరిగిన అనూహ్య ఘటనలపై ప్రతిపక్ష సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని భావించినట్లు స్పీకర్ తెలిపారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం మైక్ ఇచ్చే వెసులుబాటు లేకపోయినా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి నాలుగు వైపులా గమనిస్తూ అవకాశం కల్పించానని పేర్కొన్నారు. హరీష్ రావుకు మైక్ ఇస్తే నిన్నటి వ్యవహారంపై సభకు క్షమాపణ చెబుతారని ఆశించానని, కానీ వారు అంశాన్ని పక్కదోవ పట్టించే (డైవర్షన్) ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు సభలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న హరీష్ రావు కనీసం స్పందించకపోవడం సరికాదని, అటువంటి ప్రవర్తన వల్లనే తాను సభలో తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది

అసెంబ్లీ వెలుపల జరిగే ఘటనలు స్పీకర్ పరిధిలోకి రావనే వాదనను గడ్డం ప్రసాద్ తోసిపుచ్చారు. పబ్లిక్ గార్డెన్స్ నుంచి అసెంబ్లీ ప్రాంగణం అంతా స్పీకర్ పరిధి కిందకే వస్తుందని తెలిపారు. నిబంధనలను అతిక్రమించినందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , ఇద్దరు ఎమ్మెల్సీలను తక్షణమే సస్పెండ్ చేసి బయటకు పంపే అధికారం తనకు ఉందని, అయితే కాంగ్రెస్ పార్టీ విధానం , ప్రజాస్వామ్య సాంప్రదాయాల ప్రకారం అలా త్వరితగతిన చర్యలు తీసుకోలేదని వివరించారు. సభను నడిపించడానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన సభ నిబంధనలనే తాము ప్రస్తుతం అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.

పోలీసులపై దాడి, మహిళా ఎమ్మెల్యేల ఇష్యూపై తీవ్ర ఆగ్రహం

ఇటీవల జరిగిన ఘటనల్లో కేటీఆర్, కౌశిక్ రెడ్డిలు పోలీసులను కొట్టిన దృశ్యాలు బయటకు వచ్చాయని స్పీకర్ ప్రస్తావించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన అనుచిత ప్రవర్తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర సీరియస్‌గా ఉన్నారని తెలిపారు. ఈ ఘటనలన్నింటిపై సమగ్ర నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కేసీఆర్‌కు ఫోన్ చేసి ఆహ్వానించా

సభ ప్రారంభానికి ముందు ప్రతిపక్ష ఎల్పీ నేతలకు ఫోన్ చేసి మాట్లాడే సంప్రదాయంలో భాగంగా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు స్వయంగా ఫోన్ చేసినట్లు స్పీకర్ వెల్లడించారు. సభకు హాజరుకావాలని ఆయనను కోరగా, ప్రస్తుతం తన ఆరోగ్యం సహకరించడం లేదని కేసీఆర్ తెలిపారని స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు. సభలో సజావుగా చర్చలు జరగాలన్నదే తన తుది లక్ష్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.