NTV Telugu Site icon

కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణం

G Kishan Reddy

G Kishan Reddy

ఇప్పటి వరకు సహాయ మంత్రిగా పనిచేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ప్రమోషన్‌ వచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో చోటు దక్కింది.. ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కేబినెట్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కిషన్‌రెడ్డి.. కాగా, సికింద్రాబాద్ నుంచి తొలిసారి లోక్‌స‌భ‌కు ఎన్నికైన కిష‌న్ రెడ్డిని.. కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు స‌హాయ‌కుడిగా స‌హాయ మంత్రిత్వశాఖ‌ను కిష‌న్ రెడ్డికి అప్పగించారు. విధి నిర్వహ‌ణ‌లో కీల‌కంగా వ్యవహరించి ఇద్దరి మ‌న్నన‌లను అందుకున్న ఆయనకు ఇప్పుడు కేబినెట్‌ హోదా దక్కింది.. ఇక, కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదా ల‌భించిన తొలి తెలంగాణ నేత కిష‌న్ రెడ్డి కావ‌డం విశేషం.. తొలి నుంచి ఆరెస్సెస్ నేప‌థ్యం ఉన్న కిష‌న్ రెడ్డి యువ‌మోర్చా జాతీయ నేతగా కూడా పనిచేశారు..

కిషన్‌ రాజకీయ ప్రస్థానం 1977లో జ‌న‌తా పార్టీలో ప్రారంభం కాగా… 1980లో బీజేపీ ఆవిర్భవించిన త‌ర్వాత పూర్తికాలం కార్యక‌ర్తగా ప‌ని చేశారు. 1982-83 మ‌ధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బీజేవైఎం కోశాధికారిగా ప‌ని చేశారు. 1983-84లో బీజేవైఎం ఏపీ కార్య‌ద‌ర్శిగా, 1986-90 మ‌ధ్య అధ్యక్షుడిగా.. 2004లో బీజేవైఎం జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. అదే ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తొలిసారి హిమాయ‌త్ న‌గ‌ర్ నుంచి పోటీ చేసి విజ‌యం సాధించిన ఆయన.. 2004-14 వ‌ర‌కు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో బీజేపీఎల్పీ నేత‌గా పనిచేశారు.. ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సేవలు అందించారు.