Site icon NTV Telugu

Flipkart MoU with SERP: ఫ్లిప్‌కార్ట్‌తో సెర్ప్ ఒప్పందం.. వారికి గుడ్‌న్యూస్‌..

MoU

MoU

తెలంగాణలో మరో కీలక ఒప్పందం జరిగింది.. మ‌హిళ‌లు తయారు చేసే వస్తువులు నేరుగా అమ్ముకునే అవకాశం కల్పిస్తూ.. ఫ్లిప్‌కార్ట్‌తో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఎంవోయూ కుదుర్చుకుంది.. ఈ భాగస్వామ్యం ద్వారా, ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్‌ఫారమ్‌లో 400 మిలియన్లకు పైగా వినియోగదారులకు పాన్-ఇండియా మార్కెట్ యాక్సెస్‌ను అందించడం ద్వారా స్థానిక వ్యవసాయ సంఘాలు మరియు తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపై మహిళా సంఘాలు తయారు చేసే వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించే అవకాశం వచ్చినట్టు అయ్యింది.. ఇవాళ హైదరాబాద్‌లోని మ‌ర్రి చెన్నారెడ్డి మావ‌న వ‌న‌రుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమక్షంలో సెర్ప్​ సీఈవో, ఫ్లిప్​కార్ట్​ ఉపాధ్యక్షురాలు ఆ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ సాధించిన విజయాల్లో ఇదొక విజయంగా పేర్కొన్నారు.. ఒక మల్టీ నేషనల్ కంపెనీ, స్వయం సహాయక సంఘాలతో ఒప్పందం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేసిన ఆయన.. శుభాకాంక్షలు! అభినందనలు!! తెలిపారు.. దేశంలోనే ఇది మొదటి ఒప్పందం!గా అభివర్ణించారు.

Read Also: Vijayawada: దుర్గమ్మ భక్తులకు గమనిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.200 వరకు జరిమానా

ఈ ఏడాది 500 కోట్ల వ్యాపార లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. ఫ్లిప్ కార్డ్ కి ఒక క్రెడిట్ ఉంది. వాళ్లతో ప్రయాణం తప్పకుండా మన మ‌హిళా సంఘాల‌కు లాభం చేకూరుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. నీళ్లు, 24 గంటల కరెంట్ వచ్చింది. దండుగలా ఉన్న వ్యవసాయం పండుగలా మారింది, వ్యసాయం, ప‌రిశ్రమ‌లు ప‌చ్చగా ఉన్నాయి. సాగు దిగుబ‌డి పెరిగింది. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరిందన్నారు. ఇక, మ‌న మ‌హిళా సంఘాల‌కు దేశంలోనే మంచి పేరుందని పేర్కొన్నారు.. సాగు, వ్యవ‌సాయోతర ఉత్పత్తులు, ఇత‌ర ఉత్పత్తుల రంగంలోకి మ‌హిళ‌లు వ‌చ్చారు. మహిళా సంఘాలు ముందుకు రావడం వల్ల దళారుల వ్యవస్థకు బ్రేక్ పడిందని వెల్లడించారు. మ‌హిళ‌లు నాణ్యమైన వస్తువులు తయారు చేస్తున్నారు.. మహిళా సంఘాలు మన తెలంగాణలో ఉండటం, నేను ఆ శాఖకు మంత్రిగా ఉండటం గర్వంగా ఉందని… మహిళా సంఘాలకు వారి ఉత్పత్తులకు మంచి లాభం జరుగుతుందన్నారు ఎర్రబెల్లి.

మనకు మన మహిళలే ఆదర్శం, మన రాష్ట్రంలో ఇంకా అనేక పంటలు పండుతున్నాయి.. వాటికి కూడా మార్కెటింగ్ జరిగే విధంగా చూడాలన్నారు మంత్రి ఎర్రబెల్లి.. మహిళలు తలచుకుంటే సాధించలేనిది లేదన్న ఆయన.. మహిళలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశిస్తున్నాను.. మహిళల వద్ద రికవరీ గ్యారంటీ 100 శాతం ఉంటుందని.. మహిళల్లో మంచి చైతన్యం వచ్చిందని అభినందించారు. అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు, వ్యాపారంలో కూడా వారి చొరవ, శక్తి, శ్రమ బాగా ఉపయోగపడుతున్నాయి.. మహిళల్లో ఇంత చైతన్యం రావడానికి కారణం మహిళా సంఘాలే అన్నారు. గ్రామాల్లో మహిళలు అంటే ఒక నమ్మకం పెరిగింది.. బ్యాంకులు ఎలాంటి గ్యారంటీ లేకుండానే మ‌హిళ‌ల‌కు రుణాలు ఇవ్వడానికి ముందుకు వ‌స్తున్నాయని.. గ‌త ఏడాది 15వేల కోట్ల రుణాలు ఇచ్చాం, ఈ ఏడాది 18వేల కోట్లు ఇవ్వాల‌ని నిర్ణయించామని వెల్లడించారు..

లోన్లు తీసుకొని ఇంటి అవసరాలు తీర్చుకోవడం కాదు, వ్యాపారాలు చేయడానికి ప్రయత్నించండి అని మహిళా సంఘాలకు సలహా ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. సీఎం కేసీఆర్‌ కూడా మహిళల సాధికారతను కోరుకుంటున్నారు.. అన్ని ర‌కాల సీజ‌న‌ల్ పండ్లు, వ్యవసాయ ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు చేర్చాలన్నారు.. కల్తీ లేని, నిఖార్సైన, నాణ్యమైన వస్తువులు అమ్మాలని.. 140 రకాల ఉత్పత్తులను ప్రస్తుతం గుర్తించారు.. ఇంకా మరిన్ని వస్తువులను గుర్తిద్దాం అన్నారు.. రైతులు, మహిళలు, ఫ్లిప్ కార్డ్, వినియోగదారులకు అందరికీ ఉపయోగకరంగా ఈ ఒప్పందం ఉంటుందని భావిస్తున్నాను అని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు.

Exit mobile version