నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించింది.. దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ దూకుడు పెంచింది.. అయితే, ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆయనకు బెదిరింపులు రావడంతో.. అదనపు భద్రత కూడా కేటాయించారు.. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగిన 20 రోజుల తర్వాత తొలిసారి రేపు సొంత నియోజకవర్గం తాండూరుకి రాబోతున్నారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి.. దీంతో తాండూర్ టౌన్‌లో టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. అయితే, ఫ్లెక్సీలలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ,హోంశాఖ మంత్రి అమిత్ షా ఫొటోలను కూడా చేర్చారు.. ఇదే, ఇప్పుడు వివాదానికి కారణమైంది.
Read Also: Jogi Ramesh: చంద్రబాబుపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు.. పవన్‌ను కూడా ఏకిపారేశాడు..!
ప్రధాని మోడీ, అమిత్‌షాను అవమానించే విధంగా ఫ్లెక్సీలు పెట్టారంటూ తాండూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు.. ఫ్లెక్సీలు వెంటనే తొలగించి టీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ అయిన తర్వాత.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌కే పరిమితం అయ్యారనే విమర్శలు ఉన్నాయి.. ప్రగతి భవన్ నుంచి వారిని సీఎం కేసీఆర్ బయటకు వెళ్లనీయడంలేదంటున్నారు.. అంతేకాదు.. ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో.. మా ఎమ్మెల్యే కనిపించడంలేదంటూ విపక్షాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా చర్చగా మారిన విషయం విదితమే. రోహిత్ రెడ్డిపై ఇప్పటికే తాండూరు పీఎస్‌లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.. ఇక, ఇప్పుడు పైలట్ రోహిత్‌రెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది.