పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. తన టీమ్‌తో కలిసి వరుసగా వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో సమావేశాలు అవుతూ.. రాష్ట్రంలో ఉన్న సదుపాయాలు.. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు వివరించి.. పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు.. ఇప్పటికే వివిధ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు రాగా.. తాజాగా, తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతోంది.. తెలంగాణలో వెయ్యి కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు ఫిష్ ఇన్ (FishInn) కంపెనీ సిద్ధమైంది.. ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే కంపెనీగా పేరునున్న ఫిష్ ఇన్… రాష్ట్రంలో అడుగుపెట్టబోతోంది.. ఈ కంపెనీ పెట్టుబడితో సుమారు 5000 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
Read Also: KCR: నేడు కొల్హాపూర్‌కు సీఎం కేసీఆర్
మొత్తంగా ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్.. తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు అమెరికాలో మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో ఆ కంపెనీ ఛైర్మన్ మరియు సీఈవో మనీష్ కుమార్.. ఈ మేరకు కంపెనీ నిర్ణయాన్ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలతో పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ సిస్టంని డెవలప్ చేసేందుకు కంపెనీ నిర్ణయం తీసుకున్నదని వెల్లడించారు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద ఈ మేరకు కంపెనీ తన కార్యకలాపాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రారంభించనుంది. ఫిష్ ఇన్ కంపెనీ చేపల ఉత్పత్తిలో హ్యచరీలు, దాణా తయారీ, కేజ్ కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్ మరియు ఎగుమతుల వంటి అనేక విభాగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తామని కంపెనీ సీఈవో మనీష్ కుమార్ ఈ సందర్భంగా వెల్లడించారు.. కంపెనీ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత సుమారు 85 వేల మెట్రిక్ టన్నుల చేపలను ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే అవకాశం ఉండబోతోంది..
తెలంగాణలో భారీ పెట్టుబడిని పెట్టనున్న ఫిష్ ఇన్ కంపెనీకి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పెట్టుబడి తో తెలంగాణ రాష్ట్రంలో మత్స్య పరిశ్రమకి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యం అంది వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 5,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అధికంగా ఉన్న తెలంగాణ యువతకు ముఖ్యంగా మత్స్య పరిశ్రమపై ఆధారపడిన వారికి, మిడ్ మానేరు నిర్వాసితులకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీకి సూచించారు. చేపల పెంపకానికి సంబంధించి ఇప్పటికే వారి వద్ద ఉన్న నైపుణ్యాన్ని కంపెనీ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కంపెనీ సీఈవో మనీష్ కి సూచించారు మంత్రి కేటీఆర్.