Site icon NTV Telugu

Local Body Elections : ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

Local Body Elections

Local Body Elections

Local Body Elections : రాష్ట్రంలో గ్రామ పాలనకు సంబంధించి నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల తొలి విడత ప్రచారం సోమవారంతో ముగిసింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం నెలకొంది. తొలి విడత పోలింగ్ ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27 లక్షల 41 వేల 70 మంది పురుష ఓటర్లు ఉండగా, 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా 201 మంది ఇతర (థర్డ్ జెండర్) ఓటర్లు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఎన్నికల నిర్వహణ కోసం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు సులభంగా ఓటు వేయడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి, అనంతరం ఫలితాలను ప్రకటించనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కఠిన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉండగా, తొలి విడతలోనే 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కడా పోటీ లేకుండా గ్రామ పాలక మండళ్లు ఎంపిక కావడంతో ఆయా గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ అవసరం లేకుండా పోయింది. మిగిలిన గ్రామ పంచాయతీలలో పోలింగ్ జరగనుండగా, ప్రజల తీర్పుతో గ్రామ పాలనలో కొత్త అధ్యాయానికి నాంది పడనుంది.

Ind vs SA1st T20I: శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. మొదట బ్యాటింగ్ చేసేది ఎవరిదంటే..?

Exit mobile version