Fire Accident: రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం

  • రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో పెను విషాదం
  • సౌత్‌ గ్లాసు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో కంప్రెషర్‌ పేలడంతో ఆరుగురు మృతి
  • ఈ ఘటనలో 30 మందికి పైగా గాయాలు
Fire Accident

Fire Accident

Fire Accident: రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో భారీ పేలుడు సంభవించింది. స్థానిక సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయాలు కాగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటన జరిగిన సమయంలో కంపెనీలో 150 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు తెలిసింది.

Read Also: Jagga Reddy: రానున్న పదేళ్లలో పీసీపీ అవుతా.. సీఎం కూడా అవుతా..

ఫ్యాక్టరీలో గ్యాస్ కంప్రెష్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. మృతులు ఒడిశా, బీహార్‌ యూపీ వాసులుగా గుర్తించారు. పేలుడు ధాటికి కంపెనీకి చెందిన షెడ్ కుప్పకూలింది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. బాధితులకు గాజు ముక్కలు కుచ్చుకోవడంతో తీవ్రగాయాలయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే విషయంపై ఇంకా ఆరా తీస్తున్నారు.

అధికారులను అప్రమత్తం చేసిన సీఎం
షాద్ న‌గ‌ర్ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్య చికిత్స‌లు అందించాల‌ని ఆదేశించారు.
ప్ర‌మాద స్థ‌లిలోనే ఉన్న క‌లెక్ట‌ర్‌కు ఆదేశాలు జారీ చేశారు.రెవెన్యూ, పోలీసు, అగ్నిమాప‌క శాఖ‌, కార్మిక‌, ప‌రిశ్ర‌మ‌లు, వైద్య బృందాలు ఘ‌ట‌నా స్థ‌లిలోనే ఉండి స‌మ‌న్వ‌యంతో స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.