వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆటలాడుతున్నాయని సీపీఎం మాజీ ఎమ్మెల్యే, రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటిరంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మహబూబ్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకోవాలని చూస్తే రైతులు చూస్తూ ఊరు కోరని వారి పక్షాన సీపీఎం పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. ఇప్పటికే కళ్లాల వద్ద ధాన్యం వానలకు తడిసి, ఎండలకు ఎండుతుందని మార్కెట్లలో మౌలిక సౌకర్యాలు లేకపోవడం వలన రోజుల తరబడి వేచి చూడలేరని వెంటనే ధాన్యం కొనుగోలును చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యాసంగి వరి వేయోద్దని, వరి కొనలేమని చెప్పడం ఇది ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమని ఆయన అన్నారు.
గోదాముల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని ఖాళీ చేయించడానికి అనేక మార్గాలున్నాయని ఆయన అన్నారు. రైతులు పండించిన పంటలను ఎవ్వరూ కొంటారో, పంటను ఎవ్వరూ కొనాలో ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సరిపడనన్ని ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతులను ఆదుకోవాలని జూలకంటి తెలిపారు.
