దిష్టికి మన సమాజంలో ఎనలేని విలువ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కొత్తగా ఇల్లు కట్టుకున్నా ఇంటిముందు దిష్టిబొమ్మ కట్టడం, ఏదైనా పని ప్రారంభించినా గుమ్మడికాయను పగులగొట్టి దిష్టి లేకుండా చూసుకోవడం… దిష్టేమైనా తగిలిందేమోనని దిష్టిమంత్రాలు, యంత్రాలు వేయించడం సర్వసాధారణం. ఇలా దిష్టికి ఎనలేని ప్రాధాన్యత ఉంది మన సమాజంలో నరదిష్టంటే అంతకు మించి భయం వుంటుంది. అందుకే ఓ రైతు తన పంటకు దిష్టి తగలకుండా మనుషుల నుండి పక్షుల నుండి రక్షించుకునేందుకు వినూత్న పద్ధతి అనుసరిస్తున్నాడు.
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే రైతు తన తొమ్మిదెకరాల్లో అద్భుతమైన, ఆదర్శవంతమైన పంట సాగు చేస్తున్నాడు. ప్రధానంగా బొప్పాయి పంటను వేసిన శ్రీనివాస్ రెడ్డి… అంతర్ పంటలుగా బంతి, దానిమ్మ వంటి పూలు, పండ్ల పంటలు వేశాడు. ఈయన బొప్పాయి పంట ఏపుగా పెరిగి అటుగా వెళ్లేవారందరినీ ఇట్టే ఆకర్షిస్తోంది. చుట్టుపక్కల రైతులతో పాటే… సామాన్య జనం కూడా శ్రీనివాస్ రెడ్డి సాగు పద్ధతులు తెలుసుకోవడానికి వస్తుంటారు. ఈ బొప్పాయి పంటలను చూసి ఆకర్షితులై ఈయన పంటపొలంలోకి వెళ్లి మరీ పంటసాగు పద్దతిని తెలుసుకుంటున్నారు. దాంతోపాటే మానవ సహజమైన… పొగడ్తలతో, ఆశ్చర్యాలతో, అతిశయోక్తులతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకో రైతు శ్రీనివాస్ రెడ్డిలో చిన్న అనుమానం మొదలైంది. ఇంతమంది వచ్చిపోతున్నారు నరదిష్టి పడటం వల్ల ఏదైనా నాపంటకు హాని జరుగుతుందా అని ఆందోళనకు గురయ్యాడు. ఆందోళన నుండి వచ్చిన ఆలోచన ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డిని మరోసారి వార్తల్లో నిలిపింది. శ్రీనివాస్ కు వచ్చిన ఆలోచనతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా… తన పంటలపై నరదిష్టి పడకుండా.. ఇంకోవైపు తన పంటపొలాలను పిట్టలు, పక్షుల వంటి వాటి నుండి కాపాడుకునే ఉపాయం ఒకటి తట్టింది. వెంటనే తన ఆలోచనను ఆచరణలోకి తెచ్చాడు.
తనకిష్టమైన పలువురు హీరోయన్ల అందమైన ఫోటోలను తన పంటపొలాల్లో ఇప్పుడు దిష్టిబొమ్మలను చేశాడు. తమన్నా, సమంత, పూజాహెగ్డే, రష్మిక మందన్నా… ఇలా ఇవాళ ఇండస్ట్రీని ఒక ఊపుతున్న ఎందరో హీరోయిన్ల ఫ్లెక్సీలన్నీ రంగురంగుల్లో అందంగా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి పంటను కాపాడుతున్నాయి. మరోవైపు ఫ్లెక్సీల్లో మెరిసే కలర్స్, వెలుతురుకు వచ్చే రిఫ్లెక్షన్స్ తో బొమ్మలను చూసి పక్షులు కూడా పారిపోతున్నాయి. మన శ్రీనివాస్ రెడ్డి బొప్పాయి తోటకు హీరోయిన్లు కాపలా వుంటున్నారంటూ జోక్స్ వేసుకుంటున్నారు జనం.