Karimnagar Farmer: కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాలో ఓ రైతు కరెంట్ స్తంభం ఎక్కి బీభత్సం సృష్టించాడు. భూవివాదం కారణంగా రైతు కరెంట్ స్తంభం ఎక్కి హైటెన్షన్ వైర్లను పట్టుకునే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి అతడిని కిందకు దించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సేవాలాల్ తండాలో చోటుచేసుకుంది.
కరెంట్ స్తంభం ఎందుకు ఎక్కాడంటే..
సేవాలాల్ తండాకు చెందిన దారంసోత్ రవి, దారంసోత్ బాలరాజు అన్నదమ్ములు. రవి తండ్రి హర్యానాయక్ పేరు మీద ఉన్న కొంత భూమిని బాలరాజు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది. అయితే ఈ భూమి యాజమాన్య హక్కుల విషయంలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. పలుమార్లు పంచాయతీకి పిలిచినా సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో సోమవారం ఆ భూమిలో వేసిన వరి పంటను కోసేందుకు రవి ప్రయత్నించగా బాలరాజు అడ్డుకున్నాడు. పంచాయతీ తేల్చే వరకు వరికోత లేదన్నారు. దీంతో ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకునేంత వరకు వెళ్లింది.
దీంతో తన భూమి తనకు దక్కటం లేదని బాలరాజు తీవ్ర మనస్థాపం చెందాడు. తాను బ్రతకడం ఎందుకని భావించి ఆవేశంతో కరెంట్ స్తంభం ఎక్కాడు. హైటెన్షన్ వైర్లు పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వద్దని చెప్పిన మాట వినకుండా స్తంభం ఎక్కాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఫోన్ చేసి సరఫరా నిలిపివేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని కిందకు దించే ప్రయత్నం చేశారు. అయినా దిగి రాకపోవడంతో ఓ కానిస్టేబుల్ నీకు దండం పెడతా దిగన్నా.. నీ పిల్లలు ఆగమైతరు అని పదే పదే ప్రాధేయపడటంతో బాలరాజు కిందకు దిగి వచ్చాడు. కిందికి దిగిన బాలరాజు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు వెల్లడించారు.
TSPSC: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసు.. నిందితులను రెండో రోజు విచారించనున్న ఈడీ