Onion Farmers Tears: ఊహించని విధంగా ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. కొందరు ధర గిట్టుబాటు కావటం లేదని దేవరకద్ర మార్కె ట్లో విక్రయానికి తెచ్చిన ఉల్లిని, అదే వాహనంలో తిరిగి ఇంటికి తీసుకెళ్ళిన దుస్థితి. మార్కెట్లోకి వివిధ ప్రాంతాల నుంచి కొత్త ఉల్లి ఒక్క సారిగా వచ్చిపడింది. 2 వేల వరకు ఉండే క్వింటాల్ ఉల్లి ధర ఒక్కసారిగా 600 నుంచి 1000 రూపాయలకు పడి పోయింది. మార్కెట్ కమిటి చైర్మన్ తో పాటు దళారులు , వ్యాపారులు కుమ్మక్కై ధర రాకుండా చేస్తున్నారని రైతులు మండి పడుతున్నారు. దేవరకద్ర మార్కెట్ లో ఉల్లికి మంచి డిమాండ్ ఉంటుంది. మహబూబ్ నగర్, నారాయ ణపేట, ఆత్మకూర్, మక్తల్, కోస్గి, జడ్చర్ల, కొత్తకోట మండలాల రైతులు, పెద్ద ఎత్తున పంటను తీసుకొస్తున్నారు. అయితే వారం రోజులుగా నాణ్యతను బట్టి క్వింటా ఉల్లికి కనిష్ఠంగా 600 , గరిష్ఠంగా 1000 ధర పలుకుతోంది. ధరల పతనం తమను ముంచేస్తుందని ఉల్లి రైతులు గగ్గోలు పెడుతున్నారు.
Read Also: Baby Dead Body on Scooty: స్కూటీపై పసిబిడ్డ మృతదేహం.. తల్లిదండ్రుల 120 కిలోమీటర్ల ప్రయాణం..
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా మంచి ధర ఉంటుందని, చాలా మంది రైతులు ఉల్లి పంటను సాగుచేశారు. కానీ రెండు వారాల క్రితం కనిష్ఠంగా 1600 , గరిష్ఠంగా 2,100 ధర లభించింది. కానీ ఈ వారం మాత్రం అందులో సగానికి తగ్గిపోయింది. కొందరైతే పంటను కొయ్యాలా… వద్దా… అనే సందేహంలో ఉండగా, మరికొందరు కోసిన పంటను కాపాడుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈసారి ఉల్లి దిగుబడి పెరిగింది. అందుకు తగ్గట్లుగానే మద్దతు ధర ఉంటుందని భావించిన రైతులు ఉసూరుమంటున్నారు. కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి, తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఉల్లి ధర బాగానే పలుకుతోంది.. ఇప్పటికే కిలో ఉల్లి నాణ్యతను బట్టి రూ.20, రూ.25, రూ.30కి విక్రయిస్తున్నారు. మొత్తంగా ఓ వైపు రైతుకు.. మరో వైపు వినియోగదారుడికి తిప్పలు తప్పడం లేదు.. వ్యాపారులే లబ్ధిపొందుతున్నారు.