Fake Idols : నకిలీ విగ్రహాలతో మాయాజాలం.. ఆరుగురు ముఠా అరెస్ట్.!

  • దివ్యశక్తుల పేరుతో అమాయకులకు టోకరా
  • రూ.10 లక్షలకు నకిలీ లక్ష్మీ విగ్రహం కొనుగోలు
  • జ్యోతిష్యుడితో కలిసి మోసానికి స్కెచ్
  • విగ్రహం, రాయి, రసాయనాలు, కారు సీజ్
Fake Idols

Fake Idols

Fake Idols : నకిలీ పంచలోహ విగ్రహాన్ని చూపుతూ అద్భుత శక్తులు ఉన్నాయంటూ అమాయకులను మోసం చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను హైదరాబాదులోని టాస్క్‌ఫోర్స్, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఉమ్మడిగా నిర్వహించిన దాడిలో అరెస్ట్ చేశారు. కాటేదాన్‌ లక్ష్మిగూడ ప్రాంతంలో కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఈ దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

దివ్యశక్తుల పేరుతో రూ. 10 లక్షల నకిలీ విగ్రహంతో మోసం

పోలీసుల కథనం ప్రకారం, ఈ ముఠా 2024లో రూ. 10 లక్షలు వెచ్చించి ఒక నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని కొనుగోలు చేసింది. ఆ విగ్రహానికి ప్రత్యేక దివ్యశక్తులు ఉన్నాయని, దానిని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలసివస్తుందని ప్రచారం చేస్తూ అమాయక ప్రజలను నమ్మించేవారు. ఆపై ఆ విగ్రహాన్ని మరింత భారీ ధరకు విక్రయించి పెద్ద ఎత్తున లాభాలు గడించాలని ప్రణాళిక రచించారు. దీనితో పాటు అరుదైన గులాబీ రంగు రాయి పేరుతోనూ మరొక మోసానికి వారు స్కెచ్ వేశారు.

జ్యోతిష్యుడితో కలిసి ప్లాన్.. ముఠాలో కార్ డ్రైవర్లు, కార్మికుడు

ఈ మోసపూరిత పథకంలో ఒక జ్యోతిష్యుడు కీలక పాత్ర పోషించగా, మిగతా నిందితుల్లో కార్ డ్రైవర్లు , ఒక కార్మికుడు ఉన్నారు. జ్యోతిష్యుడి సలహాలు, నకిలీ ప్రచారాలతో ఈ ముఠా కొనుగోలుదారులను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి నకిలీ లక్ష్మీదేవి విగ్రహంతో పాటు పింక్ కలర్ రాయి, 3 రసాయన ద్రావణాల బాటిళ్లు, ఒక ఎర్టిగా కారు , 5 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. అమాయక ప్రజలు ఇలాంటి దివ్యశక్తులు, అదృష్టం తెచ్చే నకిలీ పంచలోహ విగ్రహాల పేరుతో జరిగే మోసాలను నమ్మవద్దని, సమాజంలో మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు.