BRS Party: టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి మారిన తర్వాత కేసీఆర్ దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్య నేతలు, జాతీయ నేతలతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా బీఆర్ఎస్ కార్యకలాపాలను విస్తరింపజేస్తామని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు సమక్షంలో ఒడిశా మాజీ సీఎం, ఆరాష్ట్ర సీనియర్ నేత, గిరిధర్ గమాంగ్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఒడిశాలోని కోరాపుట్ మాజీ ఎంపీ జయరాం పాంగి, బీజేపీ నేత, గిరిధర్ గమాంగ్ తనయుడు శిశిర్ గమాంగ్ సహ పెద్ద సంఖ్యలో నాయకులు బీఆర్‌ఎస్ లో చేరనున్నారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేపట్టిన ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసేందుకు అనేక రాష్ట్రాల నుంచి పలు పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావులు ముందకు వస్తున్నారు.
Read also: Deccanmall Demolition: డెక్కన్ భవనం కూల్చివేత.. బిల్డింగ్ ఒకపక్కకు ఒరిగే అవకాశం..!
1999 ఏప్రిల్ 17న జరిగిన అవిశ్వాస పరీక్షలో 13 నెలల ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వాన్ని కూల్చివేసిన కాంగ్రెస్ నేత గిరిధర్ గమాంగ్ 9 సార్లు పార్లమెంటుకు ఎన్నిక కావడం గమనార్హం. కాగా, గమాంగ్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఒడిశా ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో వాజ్‌పేయి ప్రభుత్వం ఎదుర్కొన్న అవిశ్వాస పరీక్ష సమయంలో చివరి నిమిషంలో పార్లమెంటుకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి అప్పటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలకపాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీ ఆదేశాల మేరకే 1999లో వాజ్‌పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు వెల్లడించారు. అయితే కొద్దిరోజుల్లోనే ఆయనను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తనను చిన్నచూపు చూస్తోందని ఆరోపిస్తూ ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో యాక్టివ్‌గా లేరు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. ఒడిశా బీఆర్‌ఎస్ బాధ్యతలను గమాంగ్ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Read also: Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ఆగని రష్యా దాడులు.. 11 మంది మృతి
బీజేపీ అనుసరిస్తున్న విద్వేష, వివక్షపూరిత వైఖరిని ఎండగట్టగల సత్తా సీఎం కేసీఆర్‌లోనే ఉన్నాయని, మోడీని ఎదుర్కొనే శక్తియుక్తులు కేసీఆర్‌లోనే ఉన్నాయనే అభిప్రాయం దేశమంతా పరివ్యాప్తం అవుతుంది. ఈనేపథ్యంలోనే పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతలు బీఆర్‌ఎస్ అధినేతతో సంప్రదింపులు, చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి పార్థసారథి, మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. త్వరలో విశాఖలో బీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తామని తోట చంద్రశేఖర్ వెల్లడించిన విషయం తెలిసిందే..
Bhakthi TV Live: నేడు ఈ స్తోత్రాలు విన్నా, పఠించినా మహాలక్ష్మీ అష్టైశ్వర్యాలతో మీ ఇంటికి వస్తుంది