నేడు బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు మరోసారి ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. అయితే వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. అంత పెద్ద ఎత్తున నిరసనల తరువాత కూడా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ అయ్యింది అంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. సంక్షేమ హాస్టళ్లలో, రెసిడెన్సీయల్ క్యాంపస్ లలో భోజనం కలుషితమవుతున్న సంఘటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. నేను ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు డైట్ ఛార్జీలు ఎప్పటికప్పుడు అందించామని గుర్తు చేశారు.
ఇప్పుడు బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్స్ సరుకులు సరైనవి అందించడం లేదని ఆయన తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని, పేద విద్యార్థుల మీద ఉన్న చిన్న చూపు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుశా వారికి ఓటు హక్కు లేదని కావొచ్చు అంటూ ఎద్దేవా చేశారు ఈటల. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. అయితే గత మార్చి నెలలో కూడా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం తెలిసిందే.
