తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నిన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా నేడు సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మోసపూరిత బడ్జెట్ ఇది అని మండిపడ్డారు. మంచినీటి పథకానికి 19 వేల కోట్లు అని, మిషన్ కాకతీయ 6 వేల కోట్లు అని, నీతి ఆయోగ్ నిధులు కేంద్రం ఇవ్వలేమని చెప్పిన మళ్ళీ రాష్ట్ర బడ్జెట్ లో పెట్టారని ఆయన విమర్శించారు. 15 వేల కోట్లు భూముల అమ్మకాల ద్వారా ఆదాయం వస్తుందని బడ్జెట్ లో పెట్టారని, బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైనవని, బడ్జెట్ సమావేశాలు గతంలో 40 రోజులు జరిగేవన్నారు. కానీ.. శాసన సభ సమావేశాలు ఐదారు రోజులకు పరిమితం చేశారని ఆయన ఆరోపించారు.
గ్యారంటీల కింద రాష్ట్ర ప్రభుత్వం అప్పు 1,05,006 కోట్ల రూపాయలు అని, దళిత బంధు ఒక బోగస్ అని వెల్లడించారు. 90 శాతం దళిత బంధును పూర్తిస్థాయిలో వాడుకున్న కుటుంబం లేదని, ఒక్క కుటుంబం 10 లక్షల విలువ ఆధారిత వాడుకోలేదు.. కేవలం 2-3 లక్షలతో సరిపెడుతున్నారన్నారు. హుజురాబాద్ లో అదే జరిగిందని, రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం 37,220 కోట్లకు చేరిందని, తాగడానికి బానిసలను చేస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువశక్తి గంజాయి, లిక్కర్, డ్రగ్స్ కి బానిస అవుతున్నారని, రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్స్ కోసం బడ్జెట్ లో ఒక్క పైసా కూడా పెట్టలేదని ఆయన మండిపడ్డారు. ఆదాయం మద్యం ద్వారా పెంచుకోవడం కాదు,
ఐటి కంపెనీలు పెంచుకొని ఆదాయం పెంచుకోవాలని ఆయన హితవు పలికారు.