BJP MLA Etela Rajender Made Sensational Comments On CM KCR.
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నైతికత లేని వ్యక్తి అని, బీజేపీ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలనేది కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనే అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ను ప్రజలు బండకేసి కొట్టే రోజులు దగ్గరపడ్డాయని, 2014లో టీడీపీని, 2018లో కాంగ్రెస్ పార్టీని మింగిన చరిత్ర కేసీఆర్ దని ఆయన ధ్వజమెత్తారు. పీకేలు కేసీఆర్ ని కాపాడలేరని… తెలంగాణ ప్రజల చైతన్యమే బీజేపీని గెలిపిస్తుందని అన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
హరీశ్ రావు ది కాకి లెక్కలు, దొంగ లెక్కల బడ్జెట్ అని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ అవమానిస్తోంది తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ని కాదని, శాసనసభ మర్యాదనని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఎన్నికలు హుజూరాబాద్ ఎన్నికలని ఈటల చెప్పారు. కేసీఆర్ కు నైతికత ఉంటే హుజూరాబాద్ ఎన్నికల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసేవారన్నారు.
