Site icon NTV Telugu

Etela Rajender: చర్చకు సిద్ధమా.. కేసీఆర్‌కు సవాల్

Etela Challenges Kcr

Etela Challenges Kcr

తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలం నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం vs బీజేపీ వార్ జరుగుతోన్న విషయం తెలిసిందే! కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో పనులన్నీ సవ్యంగా సాగుతున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే.. అసలు కేంద్రం రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోవడం లేదంటూ టీఆర్ఎస్ నేతలు వారి వ్యాఖ్యలు ఖండిస్తున్నారు. డప్పు కొట్టుకోవడం తప్పిస్తే, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదని టీఆర్ఎస్ తిప్పికొడుతోంది. కానీ, బీజేపీ నేతలు మాత్రం కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చిందని ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈ విషయంపై తాము చర్చకు సిద్ధమేనంటూ సవాళ్లు విసురుతున్నారు.

తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సరిగ్గా అలాంటి ఛాలెంజే చేశారు. కేంద్రం ఇచ్చే నిధులపై సీఎం కేసీఆర్‌తో అయినా, ఆర్థికమంత్రి హరీశ్ రావుతో అయినా చర్చకు సిద్ధమని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం వెలవెలబోతోందని.. అందులో పాల్గొనేందుకు అధికారులు ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. సీఎం కెసిఆర్ చెప్పే మాటలు అన్నీ పచ్చి అబద్ధాలు అని మరో సారి నిరూపించబడిందని తెలిపారు. సర్పంచులకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులే తప్ప.. మిగతా నిధులు రావడం లేదని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధులతో మాత్రమే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్రం నిధులు వాడుకుంటూ.. మొత్తం తామే చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం డప్పు కొట్టుకుంటోందని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. రెవిన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తానని మాటిచ్చిన కేసీఆర్, ఆ మాట తప్పారని ఈటెల అన్నారు.

వీఆర్వోల పరిస్థితి దారుణంగా ఈటెల ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఎవరినీ కలవరు, ఎవరు చెప్పినా వినరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే, పల్లెలు వల్లకాటుగా మారే ప్రమాదం ఉందనన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పుకునే సీఎం కేసీఆర్.. నిధులు ఇవ్వడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. 3 లక్షల వరకు తీసుకొనే రుణాలకి గాను మహిళ సంఘాలకు కేంద్ర ప్రభుత్వమే 7%వడ్డీ చెల్లించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలు ఎదిగేందుకు అనేక పథకాలు ప్రవేశపెడితే, రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఉసురు తీస్తోందని మండిపడ్డారు. అభయ హస్తం స్కీమ్‌తో పెన్షన్, ఇన్సూరెన్స్, స్కూల్‌కి వెళ్లే పిల్లలకు న్యాయం జరుగుతుందని, కానీ ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని విమర్శించారు. మహిళల కళ్ళల్లో రాష్ట్ర ప్రభుత్వం మట్టి కొట్టిందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో గొప్పగా ప్రారంభించిన బంగారుతల్లి పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిందని, రానున్న రోజుల్లో మహిళలు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని ఈటెల రాజేందర్ జోస్యం చెప్పారు. మహిళలకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంకెల కోసం మాత్రమే మొన్నటి బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఈమధ్య ప్రవేశ పెట్టిన బడ్జె‌ట్‌లో 70 వేల కోట్లు అంకెల గారడి మాత్రమేనన్నారు. మద్యపానం ద్వారా 40వేల కోట్లు గుంజుతున్నారన్నారు. ఒక్కో జిల్లాకు ఒక్కో రోజు జీతాలు ఇస్తున్న మాట వాస్తవమా? కాదా? అని ప్రశ్నించిన ఈటెల రాజేందర్.. గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఆర్థిక విషయాలపై ఆర్టీఐ ధ్వారా సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు.

Exit mobile version