NTV Telugu Site icon

బీజేపీ అధిష్టానం ఆదేశాలు.. స్పెష‌ల్ ఫ్లైట్ ర‌ద్దు చేసుకున్న ఈట‌ల‌

Etela Rajender 2

ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్‌.. భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖ‌రారు చేసుకున్నారు.. ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం.. ఈ నెల 14న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో ఆయ‌న కాషాయ కండువా క‌ప్పుకోనున్నారు.. అయితే, త‌న‌తో పాటు.. త‌న అనుచ‌రుల‌ను కూడా పెద్ద సంఖ్య‌లో పార్టీలో చేర్పించాల‌ని భావిస్తున్న ఈట‌ల‌.. అంద‌రూ వెళ్లేందుకు ప్ర‌త్యేక విమానాన్ని సిద్ధం చేసుకున్నార‌ట‌.. ముఖ్య‌నేత‌ల‌తో త‌న‌తో పాటు హ‌స్తిన‌కు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇదే స‌మ‌యంలో బీజేపీ అధిష్టానం నుంచి ఓ స‌మాచారం వ‌చ్చింది ఈట‌ల‌కు.. జాయినింగ్‌కి ఎక్కువ మంది రావొద్ద‌ని.. కొద్ది మందితోనే ఢిల్లీకి రావాల‌ని ఈట‌ల‌కు అధిష్టానం నుంచి సూచ‌న‌లు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.. దీంతో.. ప్ర‌త్యేక విమానాన్ని ర‌ద్దు చేసుకున్నారు నేత‌లు. ఇప్పుడు ప‌రిమిత సంఖ్య‌లో ఢిల్లీ వెళ్లినా.. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లోనో… త‌న నియోజ‌క‌వ‌ర్గం హుజూరాబాద్‌లో పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా.. ప‌రిమిత సంఖ్య‌లోనే రావాల్సిందిగా అధిష్టానం సూచించిన‌ట్టు స‌మాచారం. కాగా, గ‌తంలోనే టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఈట‌ల‌.. ఇవాళ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం.. దానికి స్పీక‌ర్ ఆమోద ముద్ర వేయ‌డం జ‌రిగిపోయాయి.