మానవ సంపద నిర్వీర్యం కావడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల మహాదీక్షకు మద్దతు తెలిపిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2009 కేసీఆర్ దీక్ష విరమణ జరిగిన వార్త కేయూ 2వ గేటు వద్ద విన్నాను.. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం జరిగింది. విద్యార్థి లోకం జాక్ గా ఏర్పడి దీక్షలు చేశారని గుర్తుచేశారు.. ఇక, మానవ సంపద నిర్వీర్యం కావడం రాష్ట్రానికి మంచిదికాదన్న ఆయన.. హుజురాబాద్‌లో ఎలా దౌర్జన్యం చేయాలి..? ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలి అనేదే టీఆర్ఎస్ ఆలోచన అని మండిపడ్డారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆశించిన దిశగా సాగడంలేదన్న ఆయన.. విద్యార్థులకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుందో పాలకులు ఒకసారి ఆలోచించాలన్నారు.
మన రాష్ట్రంలో ఎన్నికల కోసమే కొన్ని పథకాలు తీసుకువస్తారు అని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్.. ఏ రోజు అంబేద్కర్ జయంతికి పూల మాల కూడా వేయని కేసీఆర్.. కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే దళితబంధు స్కీం తీసుకొచ్చారని విమర్శించారు. గొల్ల కురుమల కోసం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ కూడా బ్రోకర్ల చేతికి వెళ్లింది.. మేధావులు ఈ లెక్క తేల్చాలన్న ఆయన.. విద్యార్థులు చేసే ఉద్యమాలకు ప్రజల మద్దతు ఉంటుందన్నారు.. పిడికెడు మంది చేతుల్లో ఈ దేశ సంపద బందీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసిన ఈటల.. విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను నియమించుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిందన్నారు. హుజురాబాద్ లో ఎలా గెలవాలి అనే ఆలోచన తప్ప విద్యార్థులకు మంచి చేయాలనే ఈ సర్కార్ కు లేదని మండిపడ్డ మాజీ మంత్రి.. 20వ తేదీ వచ్చినా ముసలి తల్లులకు పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితి మన ధనిక రాష్ట్రంలో వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆకలినైన బరిస్తది కానీ ఆత్మగౌరవం కోల్పోదన్న ఆయన.. విద్యార్థులు చేసే న్యాయపరమైన పోరాటాలకు నా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.. హుజురాబాద్ ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని కూల్చే ఎన్నిక కావాలని పిలుపునిచ్చిన ఈటల.. తెలంగాణ ఆకాంక్షలను ప్రతిబింబించే ఎన్నిక హుజురాబాద్ కావాలన్నారు.