Errabelli Dayakar Rao Fires On BJP In Telangana National Unity Vajrostav Celebrations: బీజేపీది దొంగ ప్రభుత్వం, అదొక చెత్త పార్టీ పార్టీ పాలకుర్తిలో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విరుచుకుపడ్డారు. తెలంగాణ పోరాటంలో బీజేపీది నయా పైసా పాత్ర లేదని తేల్చి చెప్పారు. స్వాతంత్రం కోసం శాంతియుత పోరాటం చేసిన మహాత్ముడ్ని చంపించిన చరిత్ర బీజేపీది అని.. అలాంటి పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇన్నాళ్లూ తెలంగాణకు ఏం చేయని బీజేపీ.. ఇప్పుడు విమోచన వేడుకలతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నామని, ఆ పోరాటంలో పాలకుర్తి ప్రధాన పాత్ర పోషించిందని కొనియాడారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి పోరాటయోధులు పాలకుర్తి ప్రాంతానికి చెందిన వారేనన్నారు. ప్రతీ సంవత్సరం తెలంగాణ విమోచనోద్యమ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు.
సమైక్యాంధ్రలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని.. 18 ఏళ్ళ పాటు తన ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ పోరాడి సీఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో కేసిఆర్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేల చేశారన్నారు. రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిచేలా తాను కృషి చేస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో పాలకుర్తికి గోదావరి నీళ్ళు తీసుకొచ్చామన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మోటార్లకు మీటర్లు పెట్టాలని కోరుతోందని, మీటర్లు పెడితే 50 వేల కోట్లు బహుమతిగా ఇస్తామంటోందని బాంబ్ పేల్చారు. కానీ.. సీఎం కేసీఆర్ బీజేపీ ప్రతిపాదనని తిప్పికొట్టారని, తన గొంతులో ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెట్టమని సీఎం తేల్చి చెప్పారని అన్నారు. రాబోయో రోజుల్లో పాలకుర్తిని మరింత అభివృద్ధి చేసి, రూపురేఖలు మార్చుతానని హామీ ఇచ్చారు.