Site icon NTV Telugu

ఈఎస్ఐ స్కాం… రూ.144 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఇందులో 131 ఆస్తులు ఉన్నాయని వారు వెల్లడించారు. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, చెన్నైలలో 97 ప్లాట్లు, ఆరు విల్లాలు, 18 కమర్షియల్ షాపులను మనీ లాండరింగ్ కింద అటాచ్ చేసినట్లు వారు వివరించారు. వీటిలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, శ్రీహరిబాబు, రాజేశ్వర్‌రెడ్డి, కె.పద్మ, నాగలక్ష్మీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. ఆస్తులే కాకుండా పెద్దమొత్తంలో నగదును కూడా ఈడీ ఫ్రీజ్ చేసింది.

Read Also: భార్యకు వెరైటీగా బర్త్‌డే విషెస్ తెలిపిన నేచురల్ స్టార్

ఈఎస్ఐ మెడికల్ స్కాంలో దేవికారాణి పెద్దమొత్తంలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు దొరికే పరికరాలను కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి అధిక ధరలను రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో దేవికారాణికి సంబంధించిన రూ.6.28 కోట్ల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. కాగా తెలంగాణ ఏసీబీ కేసుల ఆధారంగా ఈడీ విచారణను చేపట్టింది. ఈ కేసులో మొత్తం ఏడు కేసులను ఏసీబీ నమోదు చేసింది. ఈఎస్ఐ స్కాం వల్ల ప్రభుత్వానికి రూ.211 కోట్ల నష్టం వాటిల్లింది.

Exit mobile version