NTV Telugu Site icon

Mahabubabad: ఆ ఊరికి ఒకటే కరెంట్ మీటర్.. బిల్లు ఎంత వచ్చిందంటే..!

Mahabubabad

Mahabubabad

గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ఇక పచ్చని పల్లెలు ప్రగతికి మెట్లు అని పెద్దలు అంటుంటారు. అంతేకాదు.. కేంద్రం ప్రభుత్వం వికసిత్ భారత్ కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థికంగాను దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ అభివృద్ధిలో మాత్రం ఇంకా మార్పు కనిపించడం లేదు.

అది తెలంగాణలోని జిల్లా కేంద్రమైన మహబూబాబాద్ ప్రాంతం. 28 వార్డులోని మంద కొమురయ్య కాలనీ. దాదాపు ఇక్కడ 300 ఇళ్లులు ఉన్నాయి. ప్రజలు చాలా కాలంగా నివాసం ఉంటున్నారు. కానీ కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వసతులు కల్పించాల్సిన అధికారులు మాత్రం ముఖం చాటేశారు. దీంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. దీంతో చాలా మంది ఇళ్లు నిర్మించుకున్నారు. పురపాలక సంఘం నెంబర్లు కూడా కేటాయించింది. కానీ విద్యుత్ సౌకర్యాన్ని మరిచింది. కనీసం ఒక్క వీధి దీపాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. చీకట్లోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు.

అయితే పరిశ్రమ కోసం ఒకరు విద్యుత్ మీటర్ తెప్పించుకున్నారు. అంతే ఆ ఒక్క మీటర్‌పైనే అందరూ విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ దీపాలు వెలిగించుకుంటున్నారు. కర్రలు, చెట్లే ఊతంగా సర్వీసులు లాక్కున్నారు. తాటిచెట్టుకు ఒక స్ట్రీట్ లైటు ఏర్పాటు చేసుకున్నారు. కొమ్మల సాయంతో విద్యుత్ కనెక్షన్లు లాక్కున్నారు. అయితే ఈ ఒక్క మీటరకే ప్రతీ నెల రూ.65 వేలు కరెంట్ బిల్లు వస్తుంది. ఇప్పటి దాకా అందరూ తలా కొంత వేసుకుని చెల్లిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. పేదలకు విద్యుత్ రాయితీ ఇస్తుంటే తామెందుకు కట్టాలంటూ కొన్ని నెలలుగా కరెంట్ బిల్లు కట్టడం మానేశారు. దీంతో ఈ బిల్లు రూ.2.65 లక్షలకు చేరింది. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని కాలనీ వాసులు వాపోతున్నారు. తక్షణమే విద్యుత్ శాఖ అధికారులు తమకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయితే పురపాలక సంఘం ఖర్చులు భర్తిస్తే.. వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు.