2022 బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ మాట్లాడారు.దేశ వ్యాప్తంగా మౌళిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, డిజిటల్ ఇండియా సాధనతో ఆత్మనిర్భర భారత్ సాధికారత సాధ్యమయ్యేలా బడ్జెట్ రూప కల్పన చేశారన్నారు. పీఎం గతిశక్తి ద్వారా 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం నుండి మొదలుకుని ఆవాస్ యోజన ద్వారా పేదలకు 18 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం 48 వేల కోట్లు కేటాయించడం వరకు ప్రతీది దేశంలో సౌకర్యాల కల్పనే లక్ష్యంగా బడ్జెట్ నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగిందన్నారు. రాష్ట్రాలకు వడ్డీ లేకుండా ఋణ సౌకర్యం కోసం లక్ష కోట్లు కేటాయించడం, కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్రాలలోని ఉద్యోగులకు ఎన్ పీఎస్ డిడక్షన్ చేయడానికి నిర్ణయించడం, రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం 10.68 లక్షల కోట్లు కేటాయించడం సమాఖ్య వ్యవస్థ పై నరేంద్రమోదీ దురదృష్టికి నిదర్శనమన్నారు.
వరి, గోధుమల మద్దతు ధర కోసం 2.37 లక్షల కోట్ల కేటాయింపు, సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వడం, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచడం, అద్దె పద్దతిలో రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించడం, ల్యాండ్ రికార్డుల ఆధునీకరణ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించడం, నదుల అనుసంధానం కోసం పూర్తి స్థాయి సన్నద్ధతతో బడ్జెట్ ప్రవేశ పెట్టారన్నారు. పీఎం ఈ – విద్యకోసం 200 ఛానెల్స్ ఏర్పాటు చేయడం, డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం నిర్ణయించడం, దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంక్ ల ఏర్పాటు, MSME ల ఉత్పత్తుల అమ్మకం కోసం ప్రత్యేక పోర్టల్, అన్ని గ్రామాలకు భారత్ నెట్ ద్వారా ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్, అనేవి భారతదేశాన్ని ఆధునీకరించడంలో కీలక అడుగుగా ఈ బడ్జెట్‌ను భావించొవచ్చన్నారు. మిషన్ శక్తి , మిషన్ వాత్సల్య, మిషన్ అంగద్, పోషన్ అభియాన్ 2.0 లాంటి పథకాలను నూతనంగా ప్రవేశపెట్టడం మహిళా, శిశు సాధికారత సాధన లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. దేశంలో ముఖ్యమైన 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో నిపుణుల అంచనాలకు భిన్నంగా తాయిలాల బడ్జెట్ కాకుండా అభివృద్ధి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం మోడీ అంకిత భావానికి నిదర్శనమని డీకే అరుణ పేర్కొన్నారు.