DGP Mahender Reddy Mulugu District Tour Ends: ములుగు జిల్లా వెంకటాపురంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలను నియంత్రించేందుకు ఎలాంటి వ్యూహాలు చేపట్టాలన్న విషయంపై నాలుగు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో డీజీసీ సమాలోచనలు చేశారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ఇంటిలిజెన్సీ ఐజీ ప్రభాకర్ పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీ తెలంగాణలో కొత్త కమిటీ ఏర్పాటు చేస్తోందన్న సమాచారం అందడంతో.. పోలీస్ బాస్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారీ బందోబస్తు, పోలీసు బలగాల్ని ఏర్పాటు చేశారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడమే తమ ముఖ్య లక్ష్యమని, ఆ దిశగా ఆపరేషన్స్ కొనసాగిస్తానని డీజీజీ మహేందర్ పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీని విజిట్ చేయడం జరిగిందని, సీనియర్ అధికారులతో సమావేశమయ్యామని తెలిపారు. మావోయిస్టులు లొంగిపోయి.. జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.
ఇదిలావుండగా.. సెప్టెంబర్ నెలలో మావోయిస్టు పార్టీ 18వ వార్షికోత్సవాలు జరిగాయి. ఈ తరుణంలోనే.. తెలంగాణలో కొత్త కమిటీ విషయంపై మావోయిస్టు పార్టీ నుంచి సంకేతాలు అందాయి. దీంతో, పోలీసులు అలర్ట్ అయ్యారు. వార్షికోత్సవాల సమయం నుంచే మావోయిస్టుల్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. ఇప్పుడు పోలీస్ బాస్ అక్కడ పర్యటించడం, ప్రత్యేక సూచనలు ఇవ్వడంతో.. పోలీసులు జోరు పెంచారు.