DGP CV Anand : తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సీవీ ఆనంద్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు పురోగతి , మావోయిస్టుల పునరావాస చర్యలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తులో వేగం పెంచడమే కాకుండా, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కేసులో విచారణ దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన అధికారులు, త్వరలోనే ఈ కేసులో రెండో చార్జ్ షీట్‌ను కోర్టులో దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ , సిట్ (SIT) ఉన్నతాధికారులతో కలిసి మరోసారి లోతైన సమీక్ష నిర్వహించి, తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
శాంతిభద్రతల అంశాలతో పాటు మావోయిస్టు నేతలను ఉద్దేశించి డీజీపీ ఒక కీలకమైన విన్నపాన్ని చేశారు. అడవిలో ఉన్న నేతలు ఆయుధాలు విడిచిపెట్టి, జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల కోసం ప్రభుత్వం అత్యుత్తమ పునరావాస పద్ధతులను సిద్ధం చేసిందని, వారికి పూర్తిస్థాయిలో సాయం అందించేలా అన్ని ప్రభుత్వ శాఖలకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా లొంగిపోయిన వారి జీవన స్థితిగతులను, వారికి ఎదురయ్యే ఇబ్బందులను ప్రతి రెండు నెలలకు ఒకసారి తానే స్వయంగా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని (Personal Supervision) డీజీపీ హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో 1993 నుండే ఈ పునరావాస విధానం అమలులో ఉందని గుర్తు చేస్తూ, దీనిని మరింత పటిష్టం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
