Site icon NTV Telugu

Hyderabad: మొబైల్‌లో గేమ్ ఆడిన డిగ్రీ విద్యార్థి.. రూ.95 లక్షలు హాంఫట్

Mobile Game

Mobile Game

Hyderabad:  ఇటీవల కాలంలో విద్యార్థులు, చిన్నారులు మొబైల్‌లో గేమ్ ఆడేందుకు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. అయితే మొబైల్‌లో ఉండే పేమెంట్ యాప్స్, బ్యాంక్ యాప్‌లకు చాలా మంది సెక్యూరిటీ కోడ్‌లను పెట్టుకోవడం విస్మరిస్తున్నారు. దీంతో చిన్నారులు లేదా విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్ తీసుకుని గేమ్ ఆడిన సందర్భాలలో డబ్బులు గుల్ల చేస్తున్నారు. ఇలాంటి ఘటన తాజాగా తెలంగాణలో జరిగింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలో ఫోన్ గేమ్‌లకు అలవాటు పడ్డ హర్షవర్ధన్ అనే యువకుడు దాదాపు కోటి రూపాయల వరకు స్వాహా చేశాడు.

Read Also: 2022 Filmy Rewind: భిన్నమైన కథలతో కొత్త దర్శకులు!

డిగ్రీ విద్యార్థి హర్షవర్ధన్ తన తండ్రి మొబైల్‌లో ‘గేమ్‌కింగ్‌’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. గేమ్‌ ఆడేందుకు బ్యాంక్ అకౌంట్‌‌లోని డబ్బులు చెల్లించాల్సి రావడంతో అకౌంట్‌ నుంచి లింక్‌ చేశాడు. ఆ తర్వాత గేమ్ ఆడుతూ రూ.95 లక్షల వరకు పోగొట్టాడు. అయితే యువకుడి తండ్రి భూ నిర్వాసితుడు. కొన్నాళ్ల కిందట ప్రభుత్వం నుంచి రూ.95లక్షల పరిహారం వచ్చింది. ఈ సొమ్మును విద్యార్థి తండ్రి తన బ్యాంకు ఖాతాలో ఉంచాడు. అయితే ఈ బ్యాంక్ అకౌంట్‌ను గేమింగ్ యాప్‌కు లింక్ చేసిన విద్యార్థి ఈ సొమ్మునంతా పోగొట్టాడు. పరిహారంగా వచ్చిన సొమ్ము బ్యాంకు ఖాతాలో లేకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. డబ్బుల మాయంపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version