NTV Telugu Site icon

CM Revanth: ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్రకటించండి..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth: ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలాగే, హైద‌రాబాద్- విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిని ఆరు వ‌రుస‌లుగా విస్తరించాలని జాతీయ ర‌హాదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీని రేవంత్ ఇవాళ (బుధ‌వారం) భేటీ అయ్యారు. ఈసంద‌ర్భంగా రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల విస్తరణతో పాటు నూత‌న జాతీయ ర‌హ‌దారుల ప్రకటన, ఇప్పటికే జాతీయ ర‌హ‌దారులుగా ప్రకటించిన మార్గాల ప‌నుల ప్రారంభం త‌దిత‌ర విష‌యాల‌ను కేంద్ర మంత్రి దృష్టికి తెలంగాణ సీఎం తీసుకెళ్లారు.

Read Also: Deputy Speaker: డిప్యూటీ స్పీకర్ పదవిపై విపక్షాల ఆశలు.. లోక్‌సభలో ఆ పదవికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి?.

ఇక, సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌- తూప్రాన్‌- గ‌జ్వేల్‌- జ‌గ‌దేవ్‌పూర్‌- భువ‌న‌గిరి- చౌటుప్ప‌ల్ (158.645 కి.మీ.) ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా ప్రకటించారు.. కానీ, దాని భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్యయంలో స‌గ భాగాన్ని త‌మ ప్రభుత్వమే భ‌రిస్తోంద‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భాగంలో త‌మ వంతు ప‌నులు వేగ‌వంతం చేశామ‌న్నారు. చౌటుప్పల్ నుంచి అమ‌న్‌గ‌ల్‌- షాద్‌న‌గ‌ర్‌- సంగారెడ్డి వ‌ర‌కు (181.87 కి.మీ.) ర‌హ‌దారిని జాతీయ ర‌హ‌దారిగా ప్రకటించాలని ఆయన కోరారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగాన్ని జాతీయ ర‌హ‌దారిగా ప్రకటించి.. ఈ ఏడాది ఎన్‌హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాల‌ని తెలిపారు. హైద‌రాబాద్ (ఓఆర్ఆర్ గౌరెల్లి జంక్షన్) నుంచి వ‌లిగొండ‌- తొర్రూర్- నెల్లికుదురు- మ‌హ‌బూబాబాద్‌-ఇల్లెందు- కొత్తగూడెం వ‌ర‌కు ర‌హ‌దారిని (ఎన్‌హెచ్‌-930పీ) జాతీయ ర‌హ‌దారిగా ప్రకటించాలని కేంద్రమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

Read Also: Minister Damodar Raja Narasimha: జూడాలకు అండగా ఉంటాం.. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం..!

ఇక, హైద‌రాబాద్ వాసులు భ‌ద్రాచ‌లం వెళ్లేందుకు 40 కిలో మీటర్ల దూరం త‌గ్గించే ఈ ర‌హ‌దారిని జైశ్రీ‌రామ్ రోడ్‌గా వ‌రంగ‌ల్ స‌భ‌లో నితిన్ గడ్కరీ చెప్పిన విష‌యాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ ర‌హ‌దారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ) టెండ‌ర్లు పిలిచినందున వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని ఆయన కోరారు. ఈ స‌మావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎంపీ ఎంపీ వంశీ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు.