తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2022 జూన్ 2 నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతుంది. మరి కొన్ని రోజుల్లో తెలంగాణ అవతరణ రోజు రాబోతుండటంతో ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. దీంట్లో భాగంగా సీఎస్ సోమేష్ కుమార్ రాష్ట్ర అవతరణ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 వ తేదీన ఉదయం .ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు చేరుకొని తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తారని, అనంతరం పబ్లిక్ గార్డెన్ కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ చేస్తారని సీఎస్ సోమేష్ కుమార్ వెల్లడించారు. పోలీసు దళాల గౌరవ అందనాన్ని స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం 30 మంది ప్రముఖ కవులచే కవిసమ్మేళనం రవీంద్ర భారతి లో నిర్వహిస్తున్నట్లు వివరించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ చేసే ప్రసంగంపై అందరి చూపు ఉంది. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని గురించి మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గురించి, దేశ రాజకీయాల గురించి కీలక ప్రసంగం చేయడంతో పాటు సంచలన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.