CS Somesh Kumar Meeting With Lorry Owners Association: సెక్రటేరియట్లో సీఎస్ సోమేశ్ కుమార్‌ని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా.. తమ సమస్యల్ని పరిష్కరించడంతో పాటు కొన్ని డిమాండ్లను పూర్తి చేయాల్సిందిగా కోరారు. ఆ హామీలను ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుందని సోమేశ్ కుమార్ హామీ ఇచ్చారు. అనంతరం తెలంగాణ లారీ ఓనర్ల సంఘం అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సోమేశ్ కుమార్‌తో జరిగిన చర్చలు సఫలమయ్యాయని, సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. మునుగోడులో తాము 101 నామినేషన్లు వేస్తామని చెప్పామన్నారు. కౌంటర్ సిగ్నేచర్, గ్రీన్ ట్యాక్స్ వంటి వాటిపై క్లారిటీ ఇవ్వడంతో పాటు.. క్వార్టర్ ట్యాక్స్ కూడా రద్దు చేస్తామని మాటిచ్చారని పేర్కొన్నారు. తమపై రాజకీయ ఒత్తిళ్లు ఏమీ లేవని.. లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వకపోయినా, నాలుగు రోజుల్లో జీవో ఇస్తామన్నారని తెలిపారు. కేటీఆర్ ఇచ్చిన హామీతో నామినేషన్ వేయడాన్ని వెనక్కి తీసుకున్నామని.. మునుగోడులో తమ మద్దతు టీఆర్ఎస్కేనని వెల్లడించారు.
కొన్నిరోజుల క్రితం కూడా లారీ యజమానుల సంఘం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రాల మధ్య కామన్ పర్మిట్‌తోపాటు ఓవర్‌లోడ్ జరిమానాలు, గ్రీన్‌ట్యాక్స్ వంటి సమస్యలను పరిష్కరించాలని కోరగా.. లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని కేటీఆర్ తెలిపారు. లారీ యజమానుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో లారీ ఓనర్స్ అసోసియేషన్ భేటీ అయ్యింది. ఆ సమయంలోనే తాను టీఆర్ఎస్ను బలపరిచేందుకు సిద్ధంగా రాజేందర్ తెలిపారు.