NTV Telugu Site icon

ఖాకీలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి..

కరోనా థర్డ్‌ వేవ్‌ ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది… సెకండ్ డోస్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసుకున్న వారిపైనా కరోనా అటాక్ చేస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేసే పోలీసు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. వారం రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పదుల సంఖ్యలో కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనాకు గురైన వారిలో అధికారులు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, స్టేషన్ సిబ్బంది ఉన్నారు. తాజాగా కేయూ పోలీస్ స్టేషన్ సీఐ జనార్ధన్‌రెడ్డికి, జఫర్‌గడ్ ఎస్సై మాధవ్‌ కరోనా బారినపడ్డారు. మూడు రోజుల క్రితం వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కమలాపూర్ పీఎస్‌లో నలుగురు కానిస్టేబుళ్లు, మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు కానిస్టేబుళ్లు, కేసముద్రం పోలీస్ స్టేషన్‌లలో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఏటూరు నాగారం స్టేషన్‌లో ఇద్దరు, తొర్రూరు స్టేషన్‌లో ఇద్దరు, దుగ్గొండి స్టేషన్‌లో ఒకరు, పర్వతగిరి పోలీసుస్టేషన్‌లో ఒక్కరు కరోనాతో బాధపడుతున్నారు. నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఇందులో ఒక ఏఎస్సై, డ్రైవర్ హోమ్ గార్డ్, మరో కానిస్టేబుల్ ఉన్నారు. తాజాగా ఐనవోలు జాతర బందోబస్తుకు వెళ్లిన పోలీసులకు కరోనా టెస్టులు చేస్తే ముగ్గురికి పాజిటివ్ రావడంతో వారిని వెంటనే ఐసోలేషన్ కి పంపించారు అధికారులు.

Read Also: యూపీలో రాజీనామాలు పెద్ద విషయం కాదు.. కొట్టిపారేసిన కేంద్ర మంత్రి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు సిబ్బంది వరుసగా కరోనా బారిన పడడం ఉన్నతాధికారులను ఆందోళనలు గురి చేస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి బూస్టర్ డోస్ పంపిణీని వేగవంతం చేశారు. జాతర బందోబస్తుకు వస్తున్న వారికి ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు మస్కులు అందించడం, శానిటైజరర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయి అంటే చాలు పోలీసు క్యాంపు దగ్గరే టెస్ట్ చేసి మిగిలిన వాళ్లకు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా రెండో వేవ్ లో కరోనా బారిన పడి చనిపోయిన వారిని జ్ఞాపకాలు మరువక ముందే మరో సారి కరోనా బారిన పడుతున్న పోలీసు సిబ్బంది వణికిపోతున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిని సైతం కరోనా పీడిస్తుండటంతో సిబ్బందిలో గుబులు నెలకొంది. జాగ్రత్తలు పాటిస్తున్నా.. కరోనా బారిన పడాల్సి వస్తోందని సిబ్బంది అధికారుల దగ్గర వాపోతున్నారు.