కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిపోయి.. సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. మరోవైపు థర్డ్ వేవ్ కూడా ప్రారంభదశలో ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికలు జారీ చేసింది.. ఈ సమయంలో.. సీరం సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.. తెలంగాణలో ఇటీవల నాలుగో దఫా సీరం సర్వేని నిర్వహించింది ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ … ఆ సర్వేలో 60 శాతం మందిలో కోవిడ్ యాంటీ బాడీలను గుర్తించినట్టు ప్రకటించింది. గత నెలలో జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో ఆరోగ్య శాఖతో కలిసి ఎన్ ఐఎన్ సీరం సర్వే నిర్వహించింది.. ఆయా జిల్లాల్లో అన్ని వయసులో వారి నుంచి నమూనాలను సేకరించిన ఎన్ ఐఎన్… ఆ ఫలితాలను విడుదల చేసింది.
ఇక, సర్వేలో పాల్గొన్నచిన్నారుల్లో 55 శాతం మందిలో, పెద్దల్లో 61 శాతం మందిలో యాంటీ బాడీలో ఉన్నాయని పేర్కొంది. హెల్త్ కేర్ వర్కర్లలో అయితే ఏకంగా 82.4 శాతం మందిలో సీరో పాజిటివిటీని గుర్తించామని నివేదికలో పేర్కొంది. అయితే, గతంలో ఆయా జిల్లాలో మూడుసార్లు ఐసీఎంఆర్ నేతృత్వంలో ఎన్ ఐఎన్ సీరో సర్వే నిర్వహించింది. తొలిసారి గతేడాది మేలో చేపట్టిన సర్వేలో కేవలం 0.33 శాతం మందిలో యాంటీ బాడీలు గుర్తించగా, ఆగస్టులో చేసిన సర్వేలో 12.5 శాతం మందిలో, డిసెంబర్ లో చేసిన సర్వేలో 24.1 శాతం మందిలో సీరో పాజిటివిటీని గుర్తించారు. జూన్ లో మరో మారు జాతీయ స్థాయి సర్వేలో భాగంగా ఆయా జిల్లాల్లో సర్వే చేపట్టారు. అయితే ఈ సర్వేలో జాతీయ స్థాయిలో సీరో పాజిటివిటీ రేటు 24.1 శాతం నుంచి 67శాతానికి పెరగ్గా తెలంగాణలో మాత్రం 24.1 శాతం నుంచి 60.1శాతానికి పెరిగినట్టు స్పష్టం చేసింది. అయితే, వ్యాక్సిన్ మొదటి డోస్ వేసుకున్న వారిలో 78.5శాతం, రెండు డోసులు పూర్తి చేసుకున్న 94శాతం మందిలో యాంటీ బాడీలు వృద్ధి చెందినట్టు ప్రకటించింది. మొత్తంగా 60 శాతం మందిలో యాంటీ బాడీలు వృద్ధి చెందడం శుభపరిణామంగా చెబుతున్నారు.