దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినా ఎవరూ అజాగ్రత్తగా వుండవద్దన్నారు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్. కరోనా నియంత్రణకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ సూచించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రాజేంద్రనగర్‌లో మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సీఎస్ పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు ఇచ్చామని, నగరంలో దాదాపు 90 శాతం పౌరులకు వ్యాక్సిన్ పూర్తయ్యిందని చెప్పారు. 150 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రెండో డోస్ టీకా వేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ తెలిపారు. నగరవ్యాప్తంగా రెండు,మూడు కాలనీలకు ఒక ప్రత్యేక కేంద్రం వద్ద రెండో డోస్ ఇవ్వనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ వివరించారు. ప్రతిరోజు దాదాపు 450 కాలనీల్లో టీకా ఇస్తారని, అవసరం మేరకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పొడిగిస్తామన్నారు. కరోనా టీకాల గురించి అపోహలు వద్దని, దగ్గర్లోని ఆరోగ్య కేంద్రం ద్వారా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.