NTV Telugu Site icon

Congress : రాహుల్‌ ఓయూ పర్యటనపై మరోసారి హైకోర్టులో పిటిషన్‌..

ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సీటీని సందర్శించేందుకు ఓయూ వీసీని అనుమతులు కోరగా.. ఆయన నిరాకరించారు. దీంతో ఎన్‌ఎస్‌యూఐ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హై కోర్టు నిర్ణయాన్ని.. ఓయూ వీసీకే వదిలేసింది. అయితే.. ఈ నెల 5వ తేదీలోగా నిర్ణయం తీసుకుని, వారికి తెలియజేయాలని ఓయూ అధికారులను ఆదేశించింది హై కోర్టు. అయితే తాజాగా మరోసారి రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. రాహుల్ ఓయూ పర్యటనకు సంబంధించి హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ హైకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొంది.

అయితే రాహుల్‌ గాంధీ పర్యటనలో భాగంగాం ఈ నెల 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సందర్శనకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్‌ నేతలు కోరుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా రాహుల్‌ ఓయూకి వస్తారని వారు చెబతున్నారు. అయితే ఓయూలో రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించారు. రాజకీయ సభలకు ఓయూలో అనుమతివ్వకూడదని పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇతర సంఘాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతలను కూడా పరిగణలోకి తీసుకుని అనుమతి ఇవ్వడం లేదని వెల్లడించారు. ఓయూలో అధికారుల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని తెలిపారు.