కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇకపై రాజకీయపరమైన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించారు.. కేవలం ప్రజా సమస్యలు తీర్చేందుకు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని ప్రకటించిన ఆయన.. తనను రాజకీయాల్లోకి లాగవద్దు అని విజ్ఞప్తి చేశారు.. ఇక నుంచి భువనగిరి, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామంలో పర్యటించి అక్కడ తిష్ట వేసిన సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తానని వెల్లడించారు కోమటిరెడ్డి… గ్రామాల అభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి నిధులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తానన్న ఆయన.. పూర్తిస్థాయిలో సేవా కార్యక్రమాల మీదే దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా వీలైనంత ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేపడుతానని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైనా తన తలుపు తట్టవచ్చన్న ఆయన.. ఇకపై నో పొలిటికల్ కామెంట్స్ అని ప్రకటించారు. కాగా, పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం.. ఆ పోస్ట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన కోమటిరెడ్డి.. ఆ పదవి అధిష్టానం రేవంత్‌రెడ్డికి కట్టబెట్టడంతో.. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. అది టి.పీసీసీ కాదు.. టీడీపీ పీసీసీ అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. ఓటుకు నోటులా.. పీసీసీని అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. అయితే, ఏదైనా కుండబద్దలు కొట్టేవిధంగా మాట్లాడుతూ.. పొలిటికల్ కామెంట్లతో హీట్ పుట్టించి కోమటిరెడ్డి.. ఇప్పుడు నో పొటిలికల్ కామెంట్స్ అని ప్రకటించడం మాత్రం సంచలనమే మరి.