కరోనా విజృంభిస్తోన్న సమయంలో.. మొదట కరోనా కట్టడిపై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. మంత్రి ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు, వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడంపై స్పందించిన వీహెచ్.. మంత్రి ఈటల మీద భూ ఆరోపణలు వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించారు.. కానీ, ప్రస్తుతం తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ ఆగడం లేదు.. ఈ పరిస్థితిలో సీఎం కేసీఆర్ మంత్రి ఈటెల మీద విచారణ చేయడమేంటి..? అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో ఎందుకు విచారణ చేయలేదని నిలదీసిన వీహెచ్.. గతంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు.. వారిపై ఒక్క విచారణ కూడా చేయలేదు.. కీసరలో దళితుల భూములు కబ్జా అవుతుంటే ఎందుకు స్పందించలేదు.. గాంధీ ట్రస్ట్ భూములు, వక్ఫ్ భూములు ఏమయ్యాయి అంటూ ఫైర్ అయ్యారు. ఈటల రెండు రోజుల క్రితం కేంద్రం తీరును తప్పు పట్టడమే ఆయన చేసిన తప్పిదమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వీహెచ్.. గతంలో లాక్ డౌన్ లో కిరాయిలు అడగొద్దని చెప్పిన వ్యక్తి.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టలేరా..? అని ప్రశ్నించారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చమని ఎంతగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు.. మంత్రి ఈటెల మాత్రమే కాదు.. అన్ని పార్టీల నేతల భూకబ్జాలపై విచారణ చేయండి.. అని డిమాండ్ చేశారు.